Dry Anjeer | సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది ఏం చిరు తిండి తిందామా అని ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలనే స్నాక్స్ రూపంలో తింటున్నారు. దీంతో వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. అయితే సాయంత్రం సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాలను తింటే దాంతో పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలగడమే కాదు, పోషకాలు కూడా లభిస్తాయి. అలాగే వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఇక అలాంటి స్నాక్స్‌లో అంజీర్ ఒకటి అని చెప్పవచ్చు. ఇవి పండ్లుగా, డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే పండ్లు లభించాలంటే కేవలం సీజన్లోనే వస్తాయి. కానీ అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను మనం ఎప్పుడైనా కొనవచ్చు. అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను 3 లేదా 4 తీసుకుని ఉదయం నీటిలో నానబెట్టాలి. సాయంత్రం సమయంలో వీటిని స్నాక్స్‌లా తినాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.
అంజీర్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉండేలా చేస్తుంది. దీంతో మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. అంజీర్ పండ్లు ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తాయి. అంటే వీటిని తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందన్నమాట. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధ పడేవారికి ఉపశమనం లభిస్తుంది. అంజీర్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా రాత్రి పూట ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
అంజీర్ పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే అనేక విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పండ్లలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. కండరాలను పటిష్టం చేస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను తింటుంటే పొటాషియం కూడా అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉండేలా చేస్తుంది. డ్రై అంజీర్ పండ్లను తింటే మెగ్నిషియం కూడా అధికంగానే పొందవచ్చు. ఇది మన శరీరంలో 300కు పైగా జీవ రసాయనిక చర్యలను ప్రేరేపిస్తుంది. దీంతో కండరాలు, నాడులు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బీపీ అదుపులో ఉంటుంది.
అంజీర్ పండ్లలో ఉండే ఐరన్ రక్తం తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలోని కణాలకు ఆక్సిజన్ ఎక్కువగా అందేలా చూస్తుంది. దీంతో నీరసం, అలసట తగ్గుతాయి. అంజీర్ పండ్లలో ఉండే ఫాస్ఫరస్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు శరీరానికి శక్తి అందేలా చేస్తుంది. కణాలకు మరమ్మత్తులు చేస్తుంది. ఈ పండ్లలో ఉండే మాంగనీస్ ఎముకల నిర్మాణానికి సహాయం చేస్తుంది. మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి క్రిములను అడ్డుకుంటుంది. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. అంజీర్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.