Zubeen Garg | అస్సాం గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. సింగపూర్ వెళ్లిన జుబీన్ అక్కడ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దర్యాప్తునకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన అధికారులు గాయకుడి మేనేజర్‌ను (Zubeen Gargs manager) తాజాగా అరెస్ట్ చేశారు. జుబీన్గార్గ్ మేనేజర్ సిద్ధార్థశర్మను (Siddharth Sharma) అదులోకి తీసుకున్నారు.
ఆయనతోపాటూ నార్త్ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్కాను మహంత (North East India Festival organiser Shyamkanu Mahanta)ను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సింగపూర్ నుంచి తిరిగొచ్చిన కొద్దిసేపటికే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మహంతను అరెస్ట్ చేయగా.. గురుగ్రామ్‌లోని ఓ టోల్ ప్లాజా వద్ద సిద్ధార్థశర్మను తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరినీ గువాహటికి తరలించినట్లు తెలిపారు. అక్కడ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకెళ్లి ఆయన ముందు హాజరుపరిచారు. విచారణ కోసం వారిని కస్టడీకి ఇవ్వాలని కోరారు. పోలీసుల అభ్యర్థన మేరకు వారిని 14 రోజులపాటూ పోలీసు కస్టడీకి అనుమతిచ్చారు.
52 ఏండ్ల సింగర్ జుబీన్ గార్గ్ గత నెల 19న సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మరణించిన విషయం తెలిసిందే. స్కూబా డైవింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సింగర్ మృతిపై సీఎం హిమంత బిశ్వ శర్మ దర్యాప్తునకు ఆదేశించారు. డీజీపీ ఎంపీ గుప్తా నేతృత్వంలో 10 మందితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. జుబీన్ సన్నిహితులు, మేనేజర్ సహ అనుమానితులపై సిట్ దృష్టి సారించింది. ప్రమాద సమయంలో అక్కడున్న వారిపై నిఘా పెట్టారు. ఇప్పటికే జుబీన్ మేనేజర్ ఇంట్లో సోదాలు జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. గురువారం మ్యూజిషియన్ శేఖర్ జ్యోతి గోస్వామిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
అస్సామీతో పాటు బెంగాలీ, హిందీ భాషల్లో ఆయన గాయకుడిగా, స్వరకర్తగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. హిందీ చిత్రం ‘గ్యాంగ్‌స్టర్’ (2006)లో ఆయన ఆలపించిన ‘యా ఆలీ…’ పాట దేశవ్యాప్తంగా సంగీతప్రియుల్ని అలరించింది. ‘క్రిష్-3’ ‘ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్’ చిత్రాల్లో ఆయన పాడిన పాటలకు మంచి పేరొచ్చింది.
Also Read..
Rishabh Shetty | విజయవాడ ఈవెంట్లో భాష వివాదంపై స్పందించిన రిషబ్.. తర్వాతి సినిమాకి తెలుగులోనే..!