Rishabh Shetty | రీసెంట్గా హైదరాబాద్‌లో కాంతార చాప్టర్ 1’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ కార్యక్రమంలో హీరో రిషబ్ శెట్టి కన్నడ స్పీచ్ సోషల్ మీడియాలో పెను వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రంలో జరిగిన ఈవెంట్లో తెలుగులో మాట్లాడకుండా, స్వంత భాషలో మాట్లాడినందుకు పలువురు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ #BoycottKantara అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.ఈ వివాదంపై రిషబ్ శెట్టి తాజాగా విజయవాడలో జరిగిన మరో ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పందించారు. ఈసారి ప్రత్యేకంగా తెలుగులోనే మాట్లాడిన ఆయన – “నాకు తెలుగు అంత బాగా రాదు. కానీ ప్రయత్నిస్తున్నాను. హైదరాబాదులో జరిగిన ఈవెంట్లో కూడా మాట్లాడాలని అనుకున్నా… భాషపై నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి” అని కోరారు.
నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రభాస్‌కి థ్యాంక్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన ఎన్టీఆర్‌కి ధన్యవాదాలు. ఏపీలో టికెట్ రేట్స్ పెంచేందుకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు. కన్నడ, తెలుగు భాషలు వేర్వేరు అయినా మనం అన్నదమ్ములం. ‘జై హనుమాన్’ టైంకు పూర్తిగా తెలుగు నేర్చుకుని వస్తా. అప్పుడైతే కచ్చితంగా తెలుగులోనే మాట్లాడతా అని చెప్పుకొచ్చాడు. కాగా, కన్నడ రాష్ట్రంలో తెలుగు సినిమాలపై చూపిస్తున్న వివక్ష వల్లనే ఇప్పుడు తెలుగులోను ఇతర భాషా సినిమాలపై కాస్త గుర్రుగా ఉన్నారు.
అయితే ఈ వివాదం తారాస్థాయికి చేరిన తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. కళ మనసులను హత్తుకుని, మనుషులను కలిపే సాధనం. ప్రాంతీయత పేరుతో మనుషులను విడదీయడం కరెక్ట్ కాదు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘కాంతార చాప్టర్ 1’ కు ప్రభుత్వం స్పెషల్ పరమిషన్ ఇచ్చి, టికెట్ ధరలు పెంచేందుకు అవకాశం కల్పించింది. అక్టోబర్ 2 నుండి 11వ తేదీ వరకూ సింగిల్ స్క్రీన్లలో రూ.75 + జీఎస్టీ, మల్టీప్లెక్సుల్లో రూ.100 + జీఎస్టీగా టికెట్ ధరలు నిర్ణయించారు. ప్రీమియర్ షోలకూ అనుమతులు ఇచ్చారు. దీనిపై కొంతమంది విమర్శలు గుప్పించినా, సినిమా టీం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపింది.