Ibomma Warning to Telugu Cinema Industry | తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తున్న సినీ పైరసీ వెబ్సైట్ I BOMMA (ఐ బొమ్మ) వ్యవహారం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఇప్పటికే తెలుగు చిత్ర నిర్మాతలతో పాటు హీరోలను బెదిరిస్తూ వస్తున్న ఈ వెబ్సైట్ తాజాగా హైదరాబాద్ పోలీసులను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే..
పైరసీని కట్టడి చేయాలంటూ ఇటీవల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) సెల్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదులో ఐ బొమ్మతో సహా సుమారు 65కి పైగా వెబ్సైట్లు తెలుగు సినిమాలను పైరసీ చేస్తున్నాయని పేర్కొన్నారు. అంతేగాకుండా ఈ పైరసీ వెబ్సైట్ల నిర్వాహకులు.. తమ కాపీరైట్‌ను రక్షించుకునేందుకు ప్రయత్నించిన సినీ నిర్మాతలను ఉద్దేశిస్తూ పబ్లిక్‌గా బెదిరింపు సందేశాలను పోస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సినీ పైరసీ రాకెట్లో ఒకదానిని ఛేదించి ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఈ పైరసీ వల్ల 2024లోనే తెలుగు సినీ పరిశ్రమ దాదాపు ₹3,700 కోట్లు నష్టపోయిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. థియేటర్లలో రహస్యంగా రికార్డింగ్ చేయడం (Cam-cording), డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్లను హ్యాక్ చేసి హెచ్డీ ప్రింట్లను దొంగిలించడం వంటి రెండు పద్ధతుల్లో వీరు పైరసీకి పాల్పడుతున్నారని తెలిపారు. ఈ పైరసీ సైట్లకు ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ప్రకటనల ద్వారా కోట్ల రూపాయల నిధులు అందుతున్నాయని ఈ లావాదేవీలన్నీ క్రిప్టోకరెన్సీ ద్వారా జరుగుతున్నాయని వెల్లడించారు.
ఐ బొమ్మకు సీపీ వార్నింగ్
పైరసీ రాకెట్‌ను ఛేదించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీపీ సీవీ ఆనంద్, ఐ బొమ్మ వంటి పైరసీ వెబ్సైట్లను ఉద్దేశిస్తూ కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఐ బొమ్మతో సహా ఇతర పైరసీ సైట్ల నిర్వాహకులు ఎంతటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా వారిని ట్రాక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. Cloudflare వంటి నెట్‌వర్క్‌ల ద్వారా వెబ్సైట్లను దాచిపెట్టినా అంతర్జాతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) సహాయంతో వాటి మూలాలను ఛేదిస్తామని తెలిపారు. అయితే వార్నింగ్‌పై ఐబోమ్మ స్పందిస్తూ.. ఒక లేఖ విడుదల చేసింది. మీరు మాపై ఫోకస్ చేస్తే.. మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుందని లేఖలో తెలిపింది. అయితే దీనిపై హైదరాబాద్ పోలీసులు ఎంత సీరియస్‌గా తీసుకుని పట్టుకుంటారో వేచిచూడాలి.
Ibomma