Avika Gor | తెలుగు ప్రేక్షకులకు ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్తో దగ్గర అయిన నటీమణి అవికా గోర్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. మంగళవారం (సెప్టెంబర్ 30) ఆమె తన ప్రియుడు, వ్యాపారవేత్త మిలింద్ చాంద్వానిని పెళ్లి చేసుకొని మిస్ కాస్త మిసెస్ అయింది. ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరియు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అవికా గోర్, మిలింద్ చాంద్వానిల ప్రేమ ప్రయాణం 2019లో మొదలైంది. మిలింద్ సామాజిక కార్యకర్తగా పనిచేస్తుండగా జరిగిన ఓ ఈవెంట్లో మొదటిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం మెల్లగా స్నేహంగా మారి, అనంతరం ప్రేమగా మారింది.
2020లో బహిరంగంగా తమ ప్రేమను ప్రకటించిన ఈ జంట, 2025 జూన్లో నిశ్చితార్థం జరుపుకుంది. ఇప్పుడు, తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో మరింత బలపరిచారు. ముంబైలో జరిగిన పెళ్లి వేడుకలో తారల సందడి కనిపించింది. సెలెబ్రిటీల హాజరుతో వివాహ వేడుక ఎంతో శోభాయమానంగా మారింది . సోషల్ మీడియాలో ప్రస్తుతం అవికా పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో అవికా చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందం, ఆనందం, అద్భుతంగా మిళితమైన వేడుకగా ఆ రోజును అభిమానులు అభివర్ణిస్తున్నారు.
పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అయిన వెంటనే పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు అవికా గోర్, మిలింద్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు కూడా “చిన్నారి పెళ్లికూతురు ఇప్పుడు నిజంగా పెళ్లికూతురైంది” అంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. అవికా గోర్ చివరిగా ‘పాపం పద్మ’ అనే వెబ్ సిరీస్లో కనిపించింది. ప్రస్తుతం ఆమె ‘షణ్ముఖ’ అనే చిత్రంలో నటిస్తోంది.. దీనితో పాటు నిర్మాతగా కూడా పలు ప్రాజెక్టులు చేపడుతోంది. తెలుగు, హిందీ, కన్నడ చిత్రాల్లో యాక్టివ్గా కొనసాగుతోన్న ఈ ముద్దుగుమ్మ, పెళ్లి అనంతరం కూడా కెరీర్ను కొనసాగించనుందని తెలుస్తోంది. అయితే అవికా గోర్ & మిలింద్ చాంద్వానీ జంటకి కొత్త జీవితం ఆనందంగా, విజయవంతంగా సాగాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.