Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రస్తుతం సికిందర్ సినిమా కోసం ప్రిపరేషన్లో ఉన్నాడని తెలిసిందే. దీంతోపాటు మరోవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో కూడా సల్లూ భాయ్ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఓ సీరియస్ విషయంలో సల్మాన్ ఖాన్ వార్తల్లోకెక్కాడు. కాగా ఓ యూట్యూబర్ సల్మాన్ ఖాన్‌ను చంపేస్తారని బెదిరిస్తూ వీడియో పోస్ట్ చేయడం కలకలం రేపింది.
ఈ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన 25 ఏండ్ల యూట్యూబర్ తన ఛానల్లో సల్మాన్ ఖాన్‌ను చంపుతానంటూ వీడియో అప్లోడ్ చేయగా.. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడిని ఫజల్పురలోని బొవార్డ గ్రామానికి చెందిన బన్వరిలాల్ లతుల్లాల్ గుర్జార్‌గా గుర్తించారు. సదరు నిందితుడు గ్యాంగ్స్టర్స్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బార్ గ్యాంగ్ మెంబర్స్ తన వెంట ఉన్నారని చెప్పడం గమనార్హం. రాజస్థాన్‌లోని ఓ హైవేపై నుంచి తన ఫోన్లో తీసిన ఈ వీడియో అప్లోడ్ చేసిన కొద్ది సమయంలో నెట్టింట వైరల్ అయింది. సౌత్ సైబర్ పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.