‘నా మనసుకు దగ్గరైన వ్యక్తుల్లో బన్నీ ఒకరు. తన మీద నాకున్న ప్రేమ మొత్తం సినిమాలో కనిపిస్తుంది’అని అన్నారు సుకుమార్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫుష్ప’.అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ “పుష్ప’ద్వారా నాకో మంచి హిట్ ఇవ్వమని సుకుమార్‌ను అడిగాను. నటుడిగా ఈ సినిమాతో నాకు మంచి పేరు రావాలని చెప్పాను. ‘డార్లింగ్ నువ్వు వేరు..నేను వేరు కాదు. నీకు పేరు వస్తే అది నాకు వచ్చినట్లే ’అని అన్నారు. మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపించారు. ఓ డైరెక్టర్ హీరోను ప్రేమిస్తే సినిమా ఎంత బాగుంటుందో ఇందులో చూస్తారు’అని అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ ‘బన్నీ, నేను ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాం. చిత్ర రూపకల్పనలో నిర్మాతలు ఏ రోజూ నన్ను ఒక్క ప్రశ్న అడగకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎన్నోకష్టాలకోర్చి ఈ సినిమాను అనుకున్న సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం’అని తెలిపారు. శ్రీవల్లి పాత్రకు తాను న్యాయం చేయగలనని నమ్మి సుకుమార్ అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందని రష్మిక చెప్పింది. ‘సుకుమార్ ఆలోచన విధానం కొత్తగా ఉంటుంది. ఆ దృక్పథం వల్లే ఆయనతో పనిచేసే సాంకేతిక నిపుణులు పనితీరులో నవ్యత కనిపిస్తుంది’అని దేవిశ్రీప్రసాద్ చెప్పారు.