లేటు వయసులో ఘాటు ప్రేమాయణాలు బాలీవుడ్‌కు కొత్తేం కాదు. వలపు గాలి సోకితే వయసుతో పనేముంది అనుకుంటూ ఎందరో తారలు లేటు వయసులో ప్రేమలో మునిగితేలిన ఉదంతాలున్నాయి. తాజాగా అగ్ర నటుడు అమీర్‌ఖాన్ ఆ వరుసలో చేరారు. అరవైఏండ్ల వయసులో ఆయన ప్రేమలో పడ్డారు. గురువారం తన ప్రీబర్త్డే పార్టీలో ప్రేయసి గౌరీస్ప్రాట్ను మీడియాకు పరిచయం చేశారు. గతకొంతకాలంగా తామిద్దరం డేటింగ్లో ఉన్నట్లు తెలిపారు. ‘మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం. పరస్పర గౌరవం, భద్రతాభావంతో మా బంధం కొనసాగుతున్నది. ఇందులో దాచడానికి ఏమీలేదు. అందుకే ఈ రోజు మీ ముందుకొచ్చాను’ అన్నారు.
ప్రియురాలు గౌరీ స్ప్రాట్ గురించి చెబుతూ ‘25ఏళ్ల క్రితమే తొలిసారి తనను కలిశాను. ఆ తర్వాత టచ్‌లో లేకుండా పోయాము. రెండేళ్ల క్రితమే మేమిద్దరం మళ్లీ కలిశాం. నేను కోరుకునే మనశ్శాంతి, ప్రేమను తాను అందివ్వగలదనే నమ్మకం ఏర్పడింది’ అని అమీర్‌ఖాన్ చెప్పుకొచ్చారు. ప్రముఖ ైస్టెలిస్ట్ రీటా స్ప్రాట్ కుమార్తే గౌరీస్ప్రాట్. ప్రస్తుతం ఆమె బెంగళూరులో నివసిస్తున్నారు. అక్కడ వారి కుటుంబానికి ఓ సెలబ్రిటీ సెలూన్ కూడా ఉంది. భర్త నుంచి విడిపోయిన ఆమె ఒంటరిగా ఉంటున్నారు. గౌరీస్ప్రాట్కు ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. ఇక అమీర్‌ఖాన్ గతంలో రీనా దత్తా, కిరణ్ రావును పెళ్లాడారు. ఇద్దరికీ విడాలకులిచ్చారు. ఆయనకు ముగ్గురు పిల్లలున్న విషయం తెలిసిందే.