వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్‌ని పోషిస్తున్న వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడు. కోవెలమూడి సత్యసాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మాతలు. ఆగస్ట్ 14 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ట్రైలర్‌ను అగ్ర నటుడు చిరంజీవి విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర కథానాయిక వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ..ఈ సిరీస్‌లో కానిస్టేబుల్ కనకంగా సవాలుతో కూడిన పాత్రను పోషించానని, మహిళల గౌరవం పెంచేలా ఈ కథాంశం ఉంటుందని చెప్పింది. సందేశం, వినోదం కలబోసిన చక్కటి సిరీస్ ఇదని దర్శకుడు ప్రశాంత్‌కుమార్ పేర్కొన్నారు. తమ ఓటీటీ సంస్థలో వస్తున్న తొలి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇదని ఈటీవీ బిజినెస్ హెడ్ సాయికృష్ణ తెలిపారు.