Women’s Commission | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తిమంతమైన మాధ్యమం అని, అందులో మహిళలను అవమానించేలా, అసభ్యకరంగా చూపించడం ఆందోళనకరమని పేర్కొంది.
సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు, సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషన్ హెచ్చరించింది. మహిళలను కించపరిచేలా చూపించే డాన్స్స్టెప్స్ను వెంటనే తొలగించాలని, హెచ్చరికను పాటించకపోతే, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను కమిషన్ దృష్టికి తీసుకువస్తే, పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.