Vivek Ranjan Agnihotri | పశ్చిమబెంగాల్లో జరిగిన తాజా ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ ఓటమి చవిచూడటంతో రాజకీయ వర్గాలతో పాటు సినీ ప్రముఖులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై గతంలో పశ్చిమబెంగాల్లో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఓ వీడియో విడుదల చేశారు. వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ… తాను తెరకెక్కించిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదలైన తర్వాత పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తమపై కఠిన చర్యలు తీసుకుందని ఆరోపించారు.
ఆ సినిమా థియేటర్లలో ప్రదర్శన నిలిపివేయబడిందని తెలిపారు. అంతేకాదు, తాను రూపొందించిన మరో చిత్రం ది బెంగాల్ ఫైల్స్ ను పూర్తిగా బ్యాన్ చేశారని వెల్లడించారు. ఈ సినిమా ట్రైలర్ కార్యక్రమాన్ని కూడా అడ్డుకుని, తమపై దాడులు జరిపారని, తానూ తన టీమ్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. తమపై పలు కేసులు నమోదు చేసినప్పటికీ తాను వెనుకడుగు వేయలేదని స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో కూడా ఈ చిత్రాన్ని పశ్చిమబెంగాల్లో పలువురికి రహస్యంగా ప్రదర్శించామని, తమవంతు పోరాటం కొనసాగించామని తెలిపారు.
ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో బెంగాల్ ప్రజలకు అభినందనలు తెలియజేసిన ఆయన… ఇకపై ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వివేక్ అగ్నిహోత్రి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ వర్గాల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.