Vishwambara | మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘మన శంకర వర ప్రసాద్’ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించారు. రీజనల్ స్థాయిలో భారీ విజయం సాధించిన ఈ సినిమా, చిరంజీవి కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ సక్సెస్ జోష్‌లోనే ఇప్పుడు అభిమానుల చూపు అంతా ఆయన తదుపరి చిత్రం ‘విశ్వంభర’ పై పడింది. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’ ఒక విజువల్ గ్రాండ్ ఫాంటసీ చిత్రంగా రూపొందుతోంది. చిరంజీవిని ఇప్పటివరకు చూడని కొత్త అవతారంలో చూపించనున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే విస్తృతమైన VFX వర్క్, భారీ సెట్స్, పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా ఈ సినిమా విడుదల కొంత ఆలస్యం అవుతూ వచ్చింది.
ఫైనల్‌గా ఈ ఆలస్యం పై మెగాస్టార్ స్వయంగా స్పష్టత ఇచ్చారు. ఇటీవల జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్‌లో చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ టైమ్‌లైన్‌పై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా జూన్ లేదా జూలై నెలల్లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దాదాపుగా జూలై 9వ తేదీని టార్గెట్ చేస్తున్నట్లు ఆయన హింట్ ఇచ్చారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నా, మెగాస్టార్ మాటలే అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తాయని అంచనాలు ఉన్నాయి.
అలాగే యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా విజువల్స్ రూపొందిస్తున్నారని సమాచారం. మొత్తానికి ‘మన శంకర వర ప్రసాద్’ సక్సెస్ తర్వాత, చిరంజీవి నుంచి రాబోతున్న పూర్తి స్థాయి ఫాంటసీ ఎపిక్ ‘విశ్వంభర’ విడుదల తేదీ చుట్టూ ఆసక్తి మరింత పెరిగింది. జూన్–జూలై విండోలో సినిమా వస్తే, 2026 సమ్మర్ బాక్సాఫీస్‌ను మెగాస్టార్ షేక్ చేయడం ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో బలంగా వినిపిస్తోంది.