హీరో విశ్వక్సేన్ ముచ్చటగా మూడో సారి మెగా ఫోన్ పట్టారు. ఆయన ఇప్పటికే ఫలక్నామా దాస్, దాస్ కా ధమ్కీ చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలతో కేవలం హీరోగా, దర్శకునిగానే కాక, నిర్మాతగా, రచయితగా కూడా విశ్వక్సేన్ సత్తా చాటారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ‘కల్ట్’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనున్నది. ఈ సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచాన్ చేయగా, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు.
మరో నిర్మాత ఎస్.రాధాకృష్ణ(చినబాబు) టైటిల్ లోగోను లాంచ్ చేశారు. అతిథులంతా చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. 40మంది కొత్త నటీనటులు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారని, విశ్వక్సేన్ విజన్‌కు మద్దతిచ్చే అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేస్తున్నారని, న్యూ ఏజ్ పార్టీ థ్రిల్లర్‌గా, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నదని, ట్రెడిషనల్ ఫార్ములాలను చెరిపేసేలా సినిమా ఉంటుందని, ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రానికి మాటలు: తరుణ్‌భాస్కర్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: అర్వింద్ విశ్వనాథ్, నిర్మాతలు: కరాటే రాజు, సందీప్ కాకర్ల, నిర్మాణం: తారక్ సినిమాస్, వన్మయే క్రియేషన్స్.