Vishwak Sen | ఇటీవల జరిగిన‘లైలా’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని ఉద్దేశించి నటుడు పృథ్వీ కావాలనే ఇలా మాట్లాడారని ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి.‘ఈ సినిమాలో నా పాత్ర పేరు మేకల సత్తి. మేకల ఓనర్ని. లొకేషన్లో మేకలు తీసుకొచ్చి పెట్టారు. నన్ను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసే సీన్ తీసేముందు.. షాట్ గ్యాప్‌లో సరదాగా మేకల్ని లెక్కపెట్టాం. మొత్తం 150 ఉన్నాయి. సినిమా చివర్లో నేను జైల్ నుంచి విడుదల అవుతా. అప్పుడు లెక్కపెడితే గమ్మత్తుగా 11 ఉన్నాయి’ అంటూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విశ్వక్సేన్ ‘లైలా’ సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిచ్చాయి. ఈ నెల 14న ‘లైలా’ సినిమా విడుదల కానుండటంతో ఈ వివాదంపై చిత్ర కథానాయకుడు విశ్వక్సేన్, నిర్మాత సాహు గారపాటి సోమవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.
‘ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మా టీమ్ మొత్తాన్నీ కలవరానికి గురి చేస్తున్నాయి. రిలీజ్ రోజే హెచ్డీ ప్రింట్ లింక్ పెడతామంటూ సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు. ‘లైలా బాయ్‌కాట్’ అంటూ పాతికవేల ట్వీట్లు వేశారు. ఏవరో చేసిన తప్పుకు మేమెందుకు బలి కావాలి? తను మాట్లాడుతున్నప్పుడు నేనూ, ప్రొడ్యూసర్గారూ అక్కడలేం. చిరంజీవిగారిని రిసీవ్ చేసుకోడానికి వెళ్లాం. ఆయన ఇలా మాట్లాడారని ఇంటికెళ్లేంత వరకూ మాకు తెలీదు. అసలు ఆయన వివరించిన సన్నివేశం మా సినిమాలో లేదు. అలాంటి సీన్ మేం పెట్టలేదు. ఆయన మాటలతో మాకెలాంటి సంబంధం లేదు. మా ఎదురుగా ఇది జరిగుంటే అప్పుడే మైక్ లాక్కునేవాళ్లం. ఆయనపై కోపం సినిమాపై చూపించడం భావ్యం కాదు. సినిమాకోసం చాలా కష్టపడ్డాం. విడుదలకు ముందే చంపేయకండి. సారీ చెబితేనే కూల్‌డౌన్ అవుతామంటే.. అతని తరఫున నేను క్షమాపణలు కోరుతున్నా’ అన్నారు.