Pawan Kalyan| జనసేనాని పవన్ కళ్యాణ్ గత రాత్రి జరిగిన 12వ పార్టీ ఆవిర్భావ సభలో అనేక విషయాలు ప్రస్తావించారు. ఇందులో భాగంగా భాషా రాజకీయాలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాట హిందీని బలవంతంగా రుద్దొద్దంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకి గాను పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్ని భాషలు అవసరం. హిందీని వద్దంటున్న తమిళనాడు వాళ్లు వాళ్ల సినిమాలను హిందీలో డబ్ చేయోద్దు అని అన్నారు. ప్రస్తుతం కొందరు భాష, సంస్కృతినీ తిడుతున్నారని.. హిందీని రుద్దుతున్నారంటా హడావుడి చేస్తున్నారని పరోక్షంగా తమిళనాడు అంశాన్ని ప్రస్తావిస్తూ కొందరికి చురకలు అంటించారు.
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి గాను సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి’, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, ‘ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కళ్యాణ్ గారికి ‘ఎవరైనా చెప్పండి ప్లీజ్’ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. దీనిపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ గారిని విమర్శిస్తే నీకు ప్రచారం వస్తుంది అంటూ ప్రకాశ్ రాజ్ పై ధ్వజమెత్తారు.
మీరు బతకడం కోసం కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం నేర్చుకున్నారు. హిందీ సినిమాల ద్వారా డబ్బు సంపాదించడం ఓకే… కానీ అదే భాషపై ద్వేషాన్ని రెచ్చగొట్టడం అంటే తల్లి పాలు తాగి ఆ తల్లికి ద్రోహం చేయడమే అవుతుంది. భాషను ప్రేమించడం తప్పు కాదు… కానీ నీలాంటి వాళ్లు రాజకీయ ఓటు బ్యాంకు కోసం భాషను వాడుకోవడం సిగ్గు చేటు అంటూ విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. మరి దీనిపై ప్రకాశ్ రాజ్ ఏమైన స్పందిస్తాడా అన్నది చూడాలి. ఏది ఏమైన ఇప్పుడు భాష రాజకీయం చాలా హీటెక్కిపోతుంది.