నాలుగు దశాబ్దాల నాటి వాస్తవపరిస్థితులకు అద్దంపట్టేలా కల్పిత పాత్రలతో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం ‘పెద్దకాపు 1’. విరాట్‌కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘సామాన్యుడి సంతకం’ అంటూ పవర్ఫుల్ క్యాప్షన్‌తో రూపొందిన ఈ చిత్రానికి మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈనెల 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విరాట్‌కర్ణ విలేకరులతో ముచ్చటించాడు.
చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. ప్రభాస్ అభిమానిని. ఆ ఇష్టంతోనే ‘జయజానకీ నాయక’ చిత్రానికి ప్రొడక్షన్ సైడ్ పనిచేశాను. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. అందుకే ఓ షార్ట్ వీడియో చేసి మా బావగారికి చూపించాను. నా వీడియో నచ్చడంతో నన్ను సెలక్ట్ చేశారు. తొలి సినిమానే రెండు భాగాలుగా రావడం ఆనందంగా ఉంది. అలాగే ఒత్తిడి కూడా ఉంది. ఈ సినిమాలో చేయకముందు వైజాగ్ సత్యానంద్సార్ దగ్గర నటశిక్షణ తీసుకున్నాను.
ఇందులో ఫైట్లు రియలిస్టిగ్గా ఉండాలని ముందే చెప్పారు శ్రీకాంత్ అడ్డాల. దానికి తగ్గట్టే పీటర్హెయిన్స్ డిజైన్ చేశారు. తెరపై రియల్‌గా కొట్టుకుంటున్న ఫీలింగ్ ఆడియన్స్‌కి కలుగుతుంది. ఓ సామాన్యుడు బలవంతుడితో పోరాడి ఎలా గెలిచాడనేది పెదకాపు కథ. 1983నాటి రాజకీయనేపథ్యంలో ఎదిగిన సామాన్యుడి కథే ఇది. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువ. కానీ కష్టం అనిపించలేదు. ఓ ఎమోషనల్ సీన్ మాత్రం బాగా ఇబ్బంది పెట్టింది. ఈ సీన్లో నా నటన చూసి ‘నిన్ను ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా సర్టిఫై చేస్తున్నా’ అన్నారు పీటర్హేయిన్స్ . ఆ పక్కనేవున్న మా బావగారిలో ఆనందం చూశాను. ఆయన కళ్లలో నాకు గ్లిట్టర్ కనిపించింది.