‘హారర్, యాక్షన్, కామెడీ, రివేంజ్ అంశాలతో కూడిన మూవీ ఇది. నా పాత్రలో పెద్ద హీరోయిజం ఏమీ ఉండదు. పరిస్థితులకు తగ్గట్టు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఓ కొత్త హీరోకి ఇంతకంటే మంచి డెబ్యూ దొరకదు.’ అని విరాజ్‌రెడ్డి చీలం ఆన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘గార్డ్’. ‘రివేంజ్ ఫర్ లవ్’ అనేది ఉపశీర్షిక. మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ కథానాయికలు. జగ పెద్ది దర్శకుడు. అనసూయరెడ్డి నిర్మాత. నేడే ఈ సినిమా విడుదల.
ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో హీరో విరాజ్ రెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ‘మాది నిజామాబాద్. ఉన్నతచదువులకోసం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాను. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. అక్కడే యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లాను. ఈ మూవీ మొత్తం ఆస్ట్రేలియాలోనే తీశాం. ఈ సినిమాకు పనిచేసిన వారంతా కొత్తవాళ్లే. అందుకే ట్రైనింగ్ తీసుకొని చేశాం.
సినిమా ఆస్ట్రేలియాలో తీసినా ఇది అసలుసిసలైన తెలుగు కథ. తొలి సినిమా హారర్ జానర్ అయితే తేలిగ్గా ప్రేక్షకులకు చేరువవ్వొచ్చని ఈసినిమా చేశాను. ’అని విరాజ్‌రెడ్డి తెలిపారు. ఇందులో ఫైట్లన్నీ చైనీస్ ైస్టెల్లో ఉంటాయని, షూటింగ్ ఆస్ట్రేలియాలో చేసినా పోస్ట్‌ప్రొడక్షన్ మాత్రం ఇండియాలోనే చేశామని’ విరాజ్ తెలిపారు. కొత్తవాళ్లందరం కలిసి చేసిన వినూత్న ప్రయత్నం ఇదని, అందరికీ నచ్చుతుందని నమ్మకంతో ఉన్నామని విరాజ్ రెడ్డి అన్నారు.