Naresh | ‘సినీరంగంలో 52 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. వృత్తిపట్ల అంకితభావం, క్రమశిక్షణ వల్లే ఇది సాధ్యమైంది. ఆఖరిశ్వాస వరకు షూటింగ్‌లోనే ఉండాలని కోరుకుంటున్నా’ అన్నారు సీనియర్ నటుడు వీకే నరేష్. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘2025 నా కెరీర్లో బిజీయెస్ట్ ఇయర్ కాబోతున్నది. తొమ్మిది సినిమాలు ఏకకాలంగా షూటింగ్లో ఉన్నాయి. ఇందులో రెండు చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నా’ అన్నారు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి చెబుతూ ‘శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తున్నా. నారా రోహిత్ ‘సుందరకాండ’, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘సారంగపాణి జాతకం’, మారుతి రైటింగ్స్”బ్యూటీ’ సినిమాలతో పాటు రవితేజతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నా. అన్నింటిలో విభిన్న పాత్రల్లో కనిపిస్తా. మా అమ్మ విజయనిర్మల బయోపిక్ చేయాలనే కల ఉంది. అలాగే చిత్రం భళారే విచిత్రం, శ్రీవారికి ప్రేమలేఖ చిత్రాలకు సీక్వెల్ కూడా చేయాలనుకుంటున్నా’ అని అన్నారు.
తన తల్లి విజయనిర్మలకు పద్మ అవార్డు కోసం ఢిల్లీ వరకూ వెళ్లినా ఫలితం దక్కలేదని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘46 చిత్రాలను తీసిన ఏకైక మహిళా దర్శకురాలిగా మా అమ్మ రికార్డు సృష్టించారు. కేసీఆర్‌గారు ఆయన హయాంలో ఆమెకు పద్మ అవార్డు కోసం సిఫార్సు చేశారు. కానీ ఫలితం రాలేదు. విజయనిర్మలగారికే కాదు. చాలా మంది గొప్ప వ్యక్తులకు అవార్డులు రావడం లేదు. మరోసారి అవార్డు కోసం ప్రయత్నిస్తా’ అని నరేష్ పేర్కొన్నారు.