ఒకరితో ఒకరిని పోల్చి మాట్లాడటం సినిమారంగంలో కామనే. హీరోల విషయంలో అది మరీ కామన్. అందునా ఇద్దరూ రాజకీయపార్టీలు నెలకొల్పిన స్టార్ హీరోలైతే ఇక చెప్పేదేముంది? వారి విజయాలపై అపజయాలపై స్టోరీలే రాసేస్తుంటారు నెటిజన్స్. ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్కువయ్యాక ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. రీసెంట్గా అగ్ర నటుడు కమల్‌హాసన్ ఈ అంశంపైనే ప్రశ్నలను ఎదుర్కొన్నారు. వివరాల్లోకెళ్తే.. ‘తమిళ వట్రి కళగం’ పేరుతో నటుడు విజయ్ ఇటీవలే పార్టీ నెలకొల్పిన విషయం తెలిసిందే.
లోక్‌సభ ఎన్నికలు రానున్న సందర్భంగా సినిమాలకు పూర్తిగా దూరమవుతున్నట్టు విజయ్ ప్రకటించారు. ఈ విషయంపై కమల్‌కి మీడియా నుండి ప్రశ్నలెదురయ్యాయి. సాటి హీరో సినిమాలను వదిలి పూర్తి జీవితం రాజకీయాలకే అంకితం చేస్తుంటే, మీరు రాజకీయ పార్టీ పెట్టి కూడా సినిమాలు చేస్తున్నారు. అనేది? అనేది కమల్‌కి ఎదురైన ప్రశ్న. కమల్ మాట్లాడుతూ ‘ముందు విజయ్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
రాజకీయంగా అతడ్ని ప్రోత్సహించిన వారిలో నేనూ ఒకడ్ని. ఈ విషయంపై ఇద్దరం చర్చించుకున్నాం కూడా. రాజకీయాలా? సినిమాలా? అనేది మా వ్యక్తిగతం. ఎవరి ఐడియాలజీ వారిది. నేను చేసినట్టు తను చేయాలని లేదు. తను చేసినట్టు నేను చేయాలని లేదు. ఎవరి సామర్థ్యం వారిది. అద్భుతమైన సాహిత్యం రాసే గీతరచయితలా మమ్మల్నీ పాట రాయమంటే అది మాకెలా కుదురుతుంది చెప్పండి. మాకు తెలిసింది మాకు నచ్చినట్టు మేం చేస్తాం. నా వరకూ రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తాను. ఇది నా శైలి’ అంటూ చెప్పుకొచ్చారు కమల్‌హాసన్.