Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’తో డైరెక్టరయ్యారు రాహుల్ సంకృత్యాన్. ఆ సినిమా బాగా ఆడింది. ఆ తర్వాత నానితో ‘శ్యామ్ సింగరాయ్’ తీసి, భారీ విజయాన్ని అందుకుని సక్సెస్ఫుల్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరారాయన. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల మూడోవారంలో షూటింగ్ మొదలుకానుందని తెలుస్తున్నది. మొదటి షెడ్యూల్లో హీరో ఎంట్రీ సీన్స్ తీస్తారట.
ఇదిలావుంటే.. ఈ సినిమాలో కథ రీత్యా కీలకమైన ఓ అతిథి పాత్ర ఉందట. ఆ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్‌దత్ కనిపించనున్నట్టు టాక్. 1854-78 మధ్యకాలంలో జరిగే కథతో రూపొందుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాకోసం దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఎంచుకుంటున్న పాత్రధారుల్ని బట్టి, సినిమా స్థాయి అవగతమవుతోంది. దీనికి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.