ఇటీవలే వైవాహిక జీవితాన్ని వైభవంగా ప్రారంభించిన విరోష్(విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న) వ్యక్తిగత జీవితానికి కాస్తంత విరామమిచ్చి మళ్లీ షూటింగుల్లో బిజీ అయ్యారు. వార్దిదరూ జంటగా నటిస్తున్న పానిండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ షూటింగ్ శుక్రవారం నుంచి ఏపీలోని అనంతపురంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రెండ్రోజుల ముందే ఈ జంట అనంతపురానికి చేరుకుని, అక్కడి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించింది.
ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 6 వరకూ జరిగే ఈ షెడ్యూల్లో విజయ్ దేవరకొండ, రష్మికలపై దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ అద్భుత ఘట్టాలను చిత్రీకరించబోతున్నారు . కొన్ని దశాబ్దాల క్రితం ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పడిన డొక్కల కరువు నేపథ్య కథాంశంతో రాహల్ సంకృత్యాన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో విజయ్, రష్మికల పాత్రలు ఊహలకు అందనంత గొప్పగా ఉంటాయని, ‘రణబాలి’ అనే యోధునిగా విజయ్, అతని భార్య జయమ్మగా రష్మిక కనిపిస్తారని తెలిసింది. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ చిత్రం. ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ యర్నేని, వై.రవిశంకర్, నిర్మాణం: మైత్రీమూవీమేకర్స్.