అగ్ర హీరో విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్.నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది.
ముఖ్య తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో విజయ్ దేవరకొండ పోలీస్ గెటప్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ‘పీరియాడిక్ కథాంశమిది. విజయ్ పాత్ర చిత్రణ నవ్యరీతిలో సాగుతుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: గిరీష్ గంగాధరన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, రచన-దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి.