విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు రాహుల్ సంకృత్యాన్. ఆ సినిమా బాగా ఆడటంతో రెండో అవకాశం హీరో నాని రూపంలో తలుపు తట్టింది. అదే ‘శ్యామ్ సింగరాయ్’. ఆ సినిమా కూడా మంచి హిట్. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాను తన తొలి హీరో విజయ్ దేవరకొండతో చేస్తున్నాడు రాహుల్ సంకృత్యాన్. మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 1854-78 మధ్య కాలంలో జరిగే కథ అని తెలుస్తున్నది. ఇందులో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఇదిలావుంటే ఈ సినిమా షూటింగ్ ఈ నెల చివరి వారం నుంచి మొదలు కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. తొలి షెడ్యూల్లో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్స్ తీస్తారట. దీనికోసం ప్రత్యేకంగా సెట్‌ను కూడా వేస్తున్నట్టు తెలుస్తున్నది. సినిమా మొత్తానికి ఈ సీన్ హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇందులో విజయ్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తారట. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.