అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్దన, రణబాలి.. సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటి తర్వాత చేయబోయే సినిమాక్కూడా ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వినికిడి. తాజా సమాచారం ప్రకారం ఇటీవలే దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఓ కథను విజయ్ దేవరకొండకు వినిపించారట. విజయ్‌కి కూడా కథ బాగా నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలిసింది.
ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని సమాచారం. గుర్రపుస్వారీల నేపథ్య కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాకు ‘స్వారీ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. అసలు ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇదిలావుంటే.. హీరో నితిన్ కోసం విక్రమ్ కె.కుమార్ సిద్ధం చేసుకున్న కథ ఇదని, కొన్ని కారణాల దృష్ట్యా అది ఇప్పుడు విజయ్ చెంతకు చేరిందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తున్నది.