విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీత గోవిందం’ చిత్రం ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను మెప్పించింది. గోపీసుందర్ స్వరపరచిన గీతాలు మెలోడీ ప్రధానంగా సంగీత ప్రియుల్ని అలరించాయి. ఈ సినిమాలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ గీతం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఒలింపిక్స్ కమిటీ అధికారిక పేజీలో ఈ పాటను నేపథ్యంగా తీసుకొని ఓ వీడియోను రూపొందించడం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.
జూలై 26 నుంచి పారిస్ వేదికగా ప్రపంచ క్రీడా సంరంభం ఒలింపిక్స్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్ కమిటీ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నది. తాజాగా ఒలింపిక్ కమిటీ తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన వీడియోలో ఈఫిల్ టవర్‌తో పాటు పారిస్ అందాలను ఆవిష్కరిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ ట్యూన్‌ను జత చేసింది. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన విజయ్ దేవరకొండ ‘కొన్ని పాటలు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయి’ అనే క్యాప్షన్‌తో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రాల్లో నటిస్తున్నారు.