Vijay Devarakonda Betting apps issue | బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణల కేసులో నటుడు విజయ దేవరకొండతో పాటు పలువురు టాలీవుడ్ నటులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యువతను చెడగొడుతున్నారని మియాపుర్‌కి చెందిన ప్రమోద్ శర్మ అనే వ్యక్తి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ప్రమోషన్లను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదును స్వీకరించిన మియాపూర్ పోలీసులు.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖ తెలుగు నటులు రానా దగ్గుబాటితో పాటు మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, ప్రణీత, శ్రీముఖి, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, అనన్య నాగళ్ల తదితరులపై కేసు నమోదు చేశారు.
అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యువతను చెడగొడుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై తాజాగా విజయ్ దేవరకొండ టీం స్పందించింది. ఈ సందర్భంగా ఒక లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో బెట్టింగ్ యాప్‌లను విజయ్ ప్రమోట్ చేశారనే ఆరోపణలు టీం ఖండించింది. చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రకటనలు చేసినట్లు తెలిపింది. ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు అనుమతి ఉన్న ప్రాంతాల్లోనే విజయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. ఆయన ఏదైనా ప్రకటన స్వీకరించే ముందు లేదా ఏ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించే ముందు, ఆ సంస్థ చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అని విజయ్ బృందం సమగ్రంగా పరిశీలిస్తుంది. చట్టపరమైన అనుమతులు ఉందని తెలిసిన తర్వాతే విజయ్ దానికి ప్రచారకర్తగా ఉంటారు. అలాంటి చట్టబద్ధమైన అన్ని అనుమతులు కలిగిన ‘ఏ23’ అనే సంస్థకు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. రమ్మీ వంటి ఆటలు స్కిల్ బేస్డ్ గేమ్స్ అని సుప్రీం కోర్టు పలుమార్లు సృష్టం చేసింది. విజయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారించిన ఏ23 సంస్థతో అతడి ఒప్పందం 2023లోనే ముగిసింది. ప్రస్తుతం ఆయనకు ఆ సంస్థతో ఎలాంటి సంబంధం లేదు. అనధికారికంగా పని చేస్తున్న ఏ గేమింగ్ సంస్థకు విజయ్ ప్రచారకర్తగా వ్యవహారించలేదని ఆయన టీం వెల్లడించింది.