Vijay Devarakonda | విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్! ‘కింగ్డమ్’ మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న విజయ్ దేవరకొండ, తన తదుపరి సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు. దిల్ రాజు నిర్మాణంలో, ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరెకెక్కనుంది. మాస్ యాక్షన్, రూరల్ డ్రామా నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రం ప్రారంభ వేడుక శనివారం హైదరాబాద్‌లో సైలెంట్‌గా జరిగింది.ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అంచనాలు నెలకొన్నాయి. “కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..” అనే పంచ్ లైన్‌తో, కత్తి పట్టుకున్న రక్తంతో తడిచిన చేయి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇప్పటికే విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో నడవనుందని విజయ్ గతంలో వెల్లడించాడు.
ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కి మూవీ యూనిట్ అంతా హాజరవగా, అక్కడ నుంచి లీకైన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యేకంగా ఈ ఈవెంట్‌కి కీర్తి సురేష్ హాజరుకావడం, ఈ సినిమాలో ఆమెనే హీరోయిన్ అని గట్టి సంకేతాలు ఇస్తోంది. గతంలో కీర్తి సురేష్ హీరోయిన్గా ఉండనుందని రూమర్లు రాగా,ఇప్పుడు ఈ పిక్‌తో క్లారిటీ వచ్చినట్టే అని అంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తైన నేపథ్యంలో త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. విజయ్ దేవరకొండ మాస్ మేనరిజం, బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు మరోసారి పవర్ఫుల్ క్యారెక్టర్లో కనపించనున్నారని టాక్. ఇక కీర్తి సురేష్ వంటి టాలెంటెడ్ నటితో ఈ జోడీ ఫ్రెష్ ఫీల్ ఇవ్వడంతో పాటు సినిమా క్రేజును పెంచుతోంది.
‘లైగర్’, ‘ఖుషి’ లాంటి సినిమాల తర్వాత విజయ్ దేవరకొండకు సరైన హిట్ దక్కలేదు. అయితే ఈసారి దర్శకుడు, కథతో పాటు బలమైన టెక్నికల్ టీమ్‌ను రెడీ చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌తో విజయ్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడా? అన్న ఆసక్తికర ప్రశ్నకు సమాధానం త్వరలోనే లభించనుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ మూవీపై అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.