నటుడిగా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ సేవా, దాతృత్వ కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుంటారు అగ్ర హీరో విజయ్‌దేవరకొండ. కరోనాతో పాటు వివిధ విపత్తుల సమయంలో ఆయన ఆపన్నులకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో భారత సైన్యానికి విరాళం ప్రకటించారు విజయ్ దేవరకొండ. తన క్లాత్ బ్రాండ్ రౌడీవేర్ సేల్స్‌లో వచ్చే లాభాల్లో కొంత వాటాను ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు..మేడ్ ఫర్ ఇండియా’ అంటూ పోస్ట్ పెట్టారు విజయ్ దేవరకొండ.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. శుక్రవారం ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన సినిమాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ను వెల్లడించారు. ‘కింగ్డమ్’ సినిమా తాలూకు పోస్టర్‌ను చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి విజయ్ దేవరకొండకు జన్మదిన శుభాకాంక్షలందజేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామా చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. బ్రిటీష్‌కాలం నాటి కథ ఇది. రష్మిక మందన్న కథానాయిక. శుక్రవారం స్పెషల్పోస్టర్ను విడుదల చేసిన మేకర్స్ విజయ్‌కి బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ పోస్ట్‌లో ధ్యాన ముద్రలో కనిపిస్తున్నారు విజయ్ దేవరకొండ. అగ్ర నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. రూరల్ యాక్షన్ డ్రామా ఇది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. శుక్రవారం ఈ సినిమా నుంచి కూడా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.