Vijay Devarakonda | దేశ రాజధాని న్యూఢిల్లీలో ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ (WITT) గ్లోబల్ సమ్మిట్ 2025 మూడో ఎడిషన్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. అయితే ఇదే వేడుకలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండతో పాటు బాలీవుడ్ నటి యామీ గౌతమ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన కొత్త చిత్రం కింగ్డమ్ టీజర్‌ను విడుదల చేశారు. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు విజయ్. ఈ సినిమా టీజర్‌కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వడం వెనుక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు విజయ్. కింగ్డమ్ టీజర్ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది అనుకున్నాం. ఆయనను కలిసి ఈ విషయం చెప్పాను. కాసేపు మాట్లాడకా.. ‘ఈ సాయంత్రం రికార్డ్ చేద్దాం’ అని అన్నారు. నేను దర్శకుడు చెన్నైలో ఉన్నారని, టీజర్ మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పాను. దీంతో తారక్ అన్న మాట్లాడుతూ.. ‘సమస్య లేదు, నీవు ఇక్కడే ఉన్నావ్ కదా’ అంటూ సరే అన్నారు. ఆ డైలాగ్స్ ఆయనకు చాలా బాగా నచ్చినట్లుంది. అద్భుతంగా వాయిస్ ఓవర్ అందించారు. అన్నను గతంలో నేను తరచూ కలవకపోయినా, మా టీజర్ కోసం ఆయన వాయిస్ ఇవ్వడం నాకు ప్రత్యేకంగా అనిపించింది. అలాగే హిందీ కోసం రణ్‌బీర్ కపూర్, తమిళ వెర్షన్ కోసం సూర్య సర్ని అడిగితే వాళ్లు కుడా వెంటనే అంగీకరించారంటూ విజయ్ చెప్పుకోచ్చాడు.
అలాగే స్టార్డమ్, దక్షిణాది సినిమాల భవిష్యత్తుపై కూడా ఆయన స్పందించారు. ఒకప్పుడు బెంగాలీ సినిమా భారతీయ చలనచిత్ర రంగాన్ని ఆధిపత్యం చేసేదని, ఆ తర్వాత బాలీవుడ్ ఆ స్థానాన్ని సంపాదించిందని.. ప్రస్తుతం దక్షిణాది సినిమా ట్రెండ్ సెట్టర్‌గా మారుతోందని మీరు అనుకుంటున్నారా? అని యాంకర్ అడుగగా.. విజయ్ సమాధానమిస్తూ.. దక్షిణ సినిమాకు ఇది అద్భుతమైన కాలం. గతంలో మన గురించి ఎవరికీ తెలియని రోజులుండేవి. అప్పుడు హిందీ సినిమా ప్రమాణాలు ఉన్నతంగా ఉండేవి. ప్రపంచ వేదికపై భారత సినిమాకు గుర్తింపు తెచ్చిన ఘనత హిందీ సినిమాదే. కానీ ఇప్పటి నుంచి ఐదేళ్లలో మరిన్ని మార్పులు చోటుచేసుకోవచ్చు. బహుశా భవిష్యత్తులో అంతా భారతీయ సినిమాగా పరిగణించవచ్చు. కాబట్టి నేను ఇందులో భాగమైనందుకు గర్వంగా ఉంది అంటూ తెలిపాడు.
అలాగే తనకు నటుడిగా అవకాశం ఇచ్చిన దర్శకులను గుర్తు చేసుకున్నాడు విజయ్. కొన్ని ఏండ్ల వరకు నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. కానీ ఇప్పుడు నన్ను నా పనిని గుర్తిస్తున్నారు. నేను ఇక్కడవరకి రావడానికి నా దర్శకుల పాత్ర చాలా ఉంది. నా ఫస్ట్ దర్శకుడు నాగ్ అశ్విన్, తర్వాత తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా ఈ ముగ్గురు దర్శకులు వారి మొదటి సినిమాలను నాతోనే తీశారు. ఇప్పుడు వారందరూ స్టార్ దర్శకులుగా మారారు. మనల్ని ప్రోత్సహించే వ్యక్తులు ఉండాలి అప్పుడే మనం ఏదైన సాధించగలుగుతాం. . తెలుగు సినిమాలు భారీ విజయాలు సాధిస్తుండటం గర్వకారణంగా ఉంది. టాలీవుడ్లో అద్భుతమైన దర్శకులు ఎందరో ఉన్నారు. సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో మనం ముందుంటున్నాం అంటూ విజయ్ చెప్పుకోచ్చాడు.