VIjay Bhanu | విజయభాను అనే నటీమణి గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆమె 70వ దశకంలో ఓ వెలుగు వెలిగింది. తెలుగు సినిమా రంగంలో విజయపతాకం ఎగురవేయడమే కాకుండా.. తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించింది. అప్పటి అగ్ర కథానాయకులందరి సినిమాల్లోనూ నటించారు విజయభాను. ముఖ్యంగా అప్పట్లో “రాజబాబు – విజయభాను” జంటకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది. కొన్నాళ్లుగా అమెరికాలోనే ఉంటున్న విజయభాను గత నెలలో ఇండియాకు వచ్చారు. చెన్నైలోని తన ఇంటిని చూడటానికి వెళ్లి ఎండ వేడి తట్టుకోలేకపోయారు. వేడి కారణంగా వడదెబ్బ తగిలి విజయభాను మరణించారు.
విజయభానుకు ఒకే ఒక కుమార్తే ఉండగా, ఆమె అమెరికాలో ఓ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అయితే తన ఇంట్లో చనిపోవడం కోసమే ఆమె పనిగట్టుకుని అమెరికా నుంచి ఇండియా వచ్చారా…?” అనిపించేలా.. ఎక్కడైతే ఆమె ఒంటరిపోరాటంతో నటిగా ఓ వెలుగు వెలిగారో అక్కడే మృత్యువు ఒడిలో ఒంటరిగా ఒదిగిపోయారు. చెన్నైలో జరిగిన ఆమె దశదిన కర్మకు నటి జయప్రద హాజరై నివాళులు అర్పించారు. అలాగే విజయభాను ఆకస్మిక మృతి పట్ల నటుడు సుమన్, దర్శకనిర్మాత వై.వి.ఎస్.చౌదరి తదితరులు సంతాపం తెలిపారు.
పదేళ్ల వ్యవధిలోనే వందకు పైగా సినిమాలు చేసి “విజయభానా మజాకా” అనిపించుకుని తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి.. అప్పట్లోనే పాన్ ఇండియా పాపులర్ యాక్ట్రెస్ గా పేరు గడించింది. విజయభాను స్వస్థలం అనంతపురం కాగా, ఆమె పుట్టింది, పెరిగింది, పేరు తెచ్చుకుంది చెన్నైలోనే. అయితే ఓ అమెరికన్‌తో ప్రేమలో పడిన ఆమె, అతన్ని పెళ్లాడి అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడింది. అక్కడే శ్రీ శక్తి శారదా నృత్యనికేతన్ అనే నాట్యకళాశాల స్థాపించి వేలాది మంది విద్యార్థులకు భారతీయ నాట్యంలో శిక్షణ అందించారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథకళి లాంటి క్లాసికల్ డాన్స్ లలో తిరుగులేని ఇమేజ్ సాధించిన విజయభాను.. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. విజయ భాను మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.