Tollywood | ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవి కుమార్ మృతిని మరిచిపోకముందే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నిర్మాతగా, ఏఏ ఆర్ట్స్ అధినేతగా పేరు గాంచిన కె. మహేంద్ర (79) బుధవారం అర్ధరాత్రి కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కె. మహేంద్ర మరణవార్తతో పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో ఈ రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కే మహేంద్ర అసలు పేరు కావూరి మహేంద్ర కాగా, ఆయన స్వస్థలం గుంటూరు. ఫిబ్రవరి 4, 1946లో జన్మించారు. దర్శకుడు కావాలని అనుకున్నారు. సీనియర్ దర్శకులు కే ప్రత్యగాత్మ, కే హేమాంభరధర రావు దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారు. ప్రొడక్షన్ కంట్రోలర్ కింద పలు చిత్రాలకు ఆయన సేవలు అందించారు. ‘ప్రేమించి పెళ్లి చేసుకో (1977) చిత్రం సినిమాతో నిర్మాతగా మారారు మహేంద్ర. ఆ తర్వాత ‘ఏది పుణ్యం? ఏది పాపం?’, ‘ఆరని మంటలు’, ‘తోడు దొంగలు’, ‘బందిపోటు రుద్రమ్మ’, ‘ఎదురలేని మొనగాడు’, ‘ఢాకూరాణి’, ప్రచండ భైరవి’, ‘కనకదుర్గ వ్రత మహాత్మ్యం’ తదితర చిత్రాలు మహేంద్ర నిర్మించారు.
శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ ‘పోలీస్’ చిత్రం నిర్మించిన ఆయన మళ్లీ శ్రీహరితోనే ‘దేవా’ సినిమాను నిర్మించారు. మహేంద్రకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన కుమార్తెను మాదాల రవి వివాహం చేసుకున్నారు. కొద్దికాలం క్రితమే మహేంద్ర తనయుడు జీతు మరణించాడు. అయితే శ్రీహరి కథానాయకుడు కావడం వెనుక మహేంద్ర ఉన్నారు. కాజల్ అగర్వాల్ తెలుగు తెరకు పరిచయమైన నందమూరి కళ్యాణ్ రామ్ – దర్శకుడు తేజల ‘లక్ష్మీ కళ్యాణం’ నిర్మించింది మహేంద్రనే. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ‘అర్జున్’, ఊహ నటించిన ‘ప్రేమ లేని పుట్టిల్లు’, కరోనాకు ముందు పోసాని కృష్ణమురళి నటించిన ‘దేశముదుర్లు’ సినిమాలు కూడా మహేంద్ర కూడా ఈయన నిర్మాణంలో రూపొందినవే.. రాజశేఖర్ నటించిన ‘అర్జునా’ సినిమా ఇంకా విడుదల కాలేదు. అయితే కుమారుడి మరణం మహేంద్రను మానసికంగా కుంగదీసిందని సన్నిహితుల సమాచారం.