Varun Dhawan | బాలీవుడ్ హీర్ వరుణ్ ధావన్ తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని శుభవార్తను తన ఫ్యాన్స్‌కు అందించారు. వెస్టిబ్యులార్ హైపోఫంక్షన్ వ్యాధితో బాధపడుతున్న వరుణ్ ధావన్.. గత కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నారు. పలువురు నిపుణుల పర్యవేక్షణలో వివిధ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ కోలుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అరుదుగా వచ్చే ఈ వెస్టిబ్యులార్ హైపోఫంక్షన్ వ్యాధి కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్న వరుణ్ ధావన్.. గత కొన్ని రోజులుగా యోగా, స్విమ్మింగ్‌తోపాటు ఫిజికల్ ఫిట్నెస్ వ్యాయామాలు చేస్తున్నారు. ఈ సమయంలో వరుణ్ ధావన్ తన ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రజలకు పనికొచ్చే ఒక విషయాన్ని షేర్ చేశారు. ‘మనం నిత్యం బిజీగా ఉంటూ అన్నీ తింటున్నాం. ఎంజాయ్ చేస్తున్నాం. సూర్యరశ్మిని మాత్రం మర్చిపోతున్నాం. ఈ కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. అందుకని ప్రతీ రోజు సూర్య కిరణాలు కొన్ని నిమిషాల పాటు మన శరీరంపై పడేలా చూసుకోవడం చాలా ముఖ్యం..’ అని సూచన చేశారు.
ఏమిటీ వెస్టిబ్యులార్ హైపోఫంక్షన్..
ఈ వ్యాధితో బాధపడుతున్న వారి చెవిలోని హైపోఫంక్షన్.. సాధారణ శరీరం సమతుల్యతను కోల్పేయేలా చేస్తుంది. చెవిలో ద్రవంతో నిండిన సెమీ సర్క్యులర్ కెనాల్.. మనం కదులుతున్నప్పుడు ఈ ద్రవం కూడా కదులుతుంది. మెదడు చెవిలోని సెన్సార్ ద్వారా డాటాను స్వీకరించి శరీరాన్ని సమతుల్యంగా ఉంచేందుకు సాయపడుతుంది. వెస్టిబ్యులార్ హైపోఫంక్షన్ వ్యాధికి గురైన వారిలో శరీరం సమతుల్యత గతి తప్పి తలకు ఒక వైపు లేదా రెండు వైపులా ప్రభావితమవుతుంది. ఇది మన జీవితాన్ని, మన పనితీరును ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తుంది.
వెస్టిబ్యులార్ హైపోఫంక్షన్ వ్యాధికి గురైన వారిలో వికారం, వాంతులు, కూర్చోలేకపోవడం, శరీరంపై నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నడవడం కష్టంగా ఉంటుంది. కారు డ్రైవింగ్ చేయలేరు. ప్రయాణిస్తున్నప్పుడు ఎదురుగా వచ్చే సైన్ బోర్డులను చదవలేరు. రాత్రివేళ ఎత్తుపల్లాల రోడ్డుపై నడవలేరు. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది.