రాజమౌళి ఇప్పటివరకు చేసిన చిత్రాలన్నింటిలో ‘వారణాసి’ భిన్నంగా ఉంటుందని, సాహస ఘట్టాలు..పురాణాలు.. టైమ్ ట్రావెల్ వంటి అంశాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని అగ్ర హీరో మహేష్‌బాబు చెప్పారు. ఆయన కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విశేషాలను పంచుకుంది. 15 ఏళ్ల క్రితమే తాను రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉందని, ఇప్పటికి అది కార్యరూపం దాల్చిందని మహేష్‌బాబు చెప్పారు.
తాను కూడా రాజమౌళి అభిమానిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు. ‘ఈ సినిమాలో నేను రాముడి పాత్రలో కనిపిస్తాను. పాత్రలో పరిపూర్ణత కోసం ఎన్నో కసరత్తులు చేశాం. నేను పరుగెత్తే విధానాన్ని కూడా రాజమౌళి మార్చారు. దాని కోసం ఆరు నెలలు ప్రాక్టీస్ చేశాను. కేవలం రెండు షాట్స్ కోసం టీమ్ అంతా మూడునాలుగు నెలలు శ్రమించాం. దీన్ని బట్టి సినిమా కోసం రాజమౌళి ఎంతగా తపిస్తారో అర్థం చేసుకోవచ్చు’ అని మహేష్‌బాబు అన్నారు. తొలుత ఈ సినిమాలో హీరోగా నటించడానికి భయపడ్డానని, అయితే రాజమౌళి కథను వివరించిన తీరు తనలోని భయాన్ని పోగొట్టిందని మహేష్‌బాబు పేర్కొన్నారు.