Urvashi Rautela | నందమూరి నటసింహం లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ చిత్రంలో దబిడి దిబిడి ఐటమ్ సాంగ్ లో స్టెప్పులతో ఓ ఊపు ఊపేసిన అందాల ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ బాలీవుడ్ బ్యూటీకి లండన్‌లో ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. వింబుల్డన్ టోర్నీకి హాజరై భారత్‌కు తిరుగు ప్రయాణంలో ఉన్న ఆమె లగ్జరీ సూట్‌కేస్ గాట్విక్ ఎయిర్‌పోర్ట్‌లో మాయం కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ సూట్‌కేస్‌లో సుమారు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు ఊర్వశి తెలిపారు. తన విలువైన వస్తువులు గల్లంతవ్వడాన్ని ఊర్వశి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, వింబుల్డన్ అధికారులను ట్యాగ్ చేశారు.
ఈ సంఘటనపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎయిర్పోర్ట్ సిబ్బంది నుంచి తగిన సహకారం అందలేదని వాపోయారు. గాట్విక్ ఎయిర్పోర్ట్ వర్గాల నుంచి ఇప్పటివరకు స్పందన లేకపోవడంతో అభిమానులు, నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఊర్వశి రౌతేలా ఎదుర్కొన్న తొలి చేదు అనుభవం కాదని చెప్పాలి. 2023లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో రూ.45 లక్షల విలువైన చెవిపోగు పోగొట్టుకుంది. అలానే గతంలో ఆమె ఐఫోన్ కూడా చోరీకి గురయ్యిందని స్వయంగా వెల్లడించారు. వరుసగా ఇలా విలువైన వస్తువులు కోల్పోవడం ఆమె అభిమానులను ఆందోళనలోకి నెట్టేస్తోంది. కాగా ఈ నెల ప్రారంభంలో లండన్‌లో జరిగిన వింబుల్డన్ ఛాంపియన్షిప్ 2025లో మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌కు ఊర్వశి హాజరైంది.
ఉర్వశి రౌతేలా ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు తెలుగు పరిశ్రమలోనూ మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంలోని బాస్ పార్టీ పాటతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఆ పాట యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకొని ఆమెకు భారీ పాపులారిటీని తీసుకొచ్చింది. ఇక నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన చిత్రంలో SI జానకి పాత్రలో నటించిన ఊర్వశి, దబిడి దిబిడి పాటలో బాలయ్యతో కలసి స్టెప్పులు వేసి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఆమెకు నటిగా సరికొత్త అవకాశాలు లభిస్తున్నాయి.ప్రస్తుతం రామ్ పోతినేని నటిస్తోన్న ఆంధ్రా కింగ్ , జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న డ్రాగన్ చిత్రాల్లో కీలక పాత్రలు లేకుంటే స్పెషల్ సాంగ్స్‌లో కనిపించే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.