Urmila Matondkar | సినీ ఇండస్ట్రీలో తారల పెళ్లిళ్లు.. విడాకులు కొత్తమే కాదు. ఇటీవల పొన్నియన్ సెల్వన్ స్టార్ తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత భార్య నుంచి విడాకులు తీసుకోనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాజాగా మరో నటి విడాకులు సంచలనంగా మారాయి. నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన ఊర్మిళ మటోండ్కర్ భర్త మోహ్సిన్ అక్తర్ మీర్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. విడాకుల కోసం జంట ఇప్పటికే కోర్టులో దరఖాస్తు చేసినట్లు సమాచారం. అయితే, డివోర్స్‌కి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఇద్దరూ ఓ అంగీకారానికి వచ్చి విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసినట్లు తెలుస్తున్నది. మార్చి 2016లో ఊర్మిళ కశ్మీరీ వ్యాపారవేత్త, మోడల్ అయిన మోహ్సిన్ను వివాహం చేసుకున్నారు. వీరి నిఖా ముంబయిలో జరిగింది. బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఊర్మిళ కన్నా మోహ్సిన్ పదేళ్లు చిన్నవాడు కావడం గమనార్హం. ఊర్మిళ సోషల్ మీడియాలో భర్తను అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. చివరిసారిగా జూన్ 2023లో ఈద్ వేడుకలు జరుపుకుంటున్న ఫొటోలను షేర్ చేసింది. ఊర్మిళ ప్రస్తుతం ‘తివారీ’ వెబ్ సిరీస్‌తో పునరాగమనం చేస్తున్నది. తొలిసారిగా ఓటీటీ ఫ్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇస్తున్నది. ఊర్మిళ హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లోనూ నటించింది. 1980లో తొలిసారిగా మరాఠీ సినిమా జాకోల్లో బాలనటిగా కనిపించింది. 1989లో మలయాళంలో చాణక్యన్ మూవీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఓ భార్య కథ, గాయం, అనగనగా ఒకరోజు, భారతీయుడు, రంగీలా, సత్య సినిమాల్లో కనిపించింది. 1995లో వచ్చిన రంగీలా మూవీ ఊర్మిళకు మంచి పేరును తీసుకువచ్చింది. 1997లో వచ్చిన జుదాయీ, 1998లో వచ్చిన సత్య మూవీతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.