Union Minister Bandi Sanjay | సినీ నటుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం పట్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం తన చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిందని శుక్రవారం పేర్కొన్నారు.
అల్లు అర్జున్ నటించిన `పుష్ఫ-2`.. పాన్ ఇండియా సినిమా అని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రపంచమంతా తెలుసునని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఒక సినిమా ఓపెనింగ్ రోజు అగ్ర హీరోలంతా ఆర్టీసీ క్రాస్ రోడ్ కు రావడం 50 ఏళ్లుగా షరా మామూలే కదా అని గుర్తు చేశారు.
ఈ విషయం తెలిసినా కూడా ప్రభుత్వం ఎందుకు ముందస్తు రక్షణ ఏర్పాట్లు తీసుకోలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యానికి అమాయక మహిళ బలైతే ఇతరులపై తప్పును నెట్టి శిక్షించాలనుకోవడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్‌కు కనీసం సమయం ఇవ్వకుండా బెడ్రూంలోకి వెళ్లి అరెస్ట్ చేయడం సిగ్గు చేటని అభివర్ణించారు.