ఢిల్లీ : ఐపీఎల్ ఆడేందుకు వేలంలో పేర్లు ఇచ్చి తీరా సీజన్ ఆరంభానికి ముందు లీగ్ నుంచి ఉన్నఫళంగా వైదొలిగే ఆటగాళ్లపై బీసీసీఐ విధించే రెండేండ్ల నిషేధం సరిపోవడం లేదని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. తాజా సీజన్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్ల ధరతో దక్కించుకుని మ్యాచ్‌లు ఆడతాడని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా.. తీరా సీజన్ ప్రారంభ సమయానికి నాలుగు రోజుల ముందు తాను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించాడు.
బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు ఇలా వైదొలిగితే ఐపీఎల్లో వారు రెండేండ్లపాటు పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నది. డకెట్ నిర్ణయం నేపథ్యంలో గవాస్కర్ స్పందిస్తూ.. ‘డకెట్ యాషెస్‌లో బాగానే ఆడాడు. హండ్రెడ్ వేలంలోనూ అతడికి మంచి ధర దక్కింది. అక్కడ అనుకున్న ధర రావడంతోనే ఐపీఎల్ నుంచి తప్పుకుని ఉండొచ్చు. అయితే బీసీసీఐ విధించే రెండేండ్ల బ్యాన్ అనేది సరిపోవడం లేదనే విషయం ఇక్కడ స్పష్టమవుతున్నది. ఇలా చేసే క్రికెటర్లు రెండేండ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌కు రావొచ్చనే భావనలో ఉన్నారు. కానీ ఈ నిబంధనను మరింత కఠినతరం చేసి అది వారిపై ప్రభావం పడేలా చేస్తేనే ఇలాంటివి పునరావృతం కావు’ అని అన్నాడు.