Vijay | తమిళనాడులోని కరూర్ పట్టణంలో శనివారం రాత్రి జరిగిన రాజకీయ సభ మృత్యుక్షేత్రంగా మారింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మరణించినవారిలో 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలు ఉండటం మరింత కలచివేసింది. దేశవ్యాప్తంగా విషాదం అలముకుంది. విజయ్ రాజకీయంగా ఆరంగేట్రం చేయడం, ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడతారన్న కారణంగా సభకు అనూహ్యంగా భారీగా జనాలు తరలివచ్చారు. సభ నిర్వహణలో లోపాల కారణంగా నియంత్రణ కోల్పోయి తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో 95 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తుండగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విజయ్, సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా స్పందించారు. మీ ముఖాలన్నీ నా మనసులో మెదులుతున్నాయి.నాపై చూపిన ప్రేమను తలచుకుంటే గుండె మరింత బరువెక్కుతోంది. మీ బాధ తీర్చలేనిది… కానీ మీ కుటుంబ సభ్యుడిగా నా వంతుగా సహాయం చేస్తున్నాను అని ట్వీట్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారం ఇస్తానని విజయ్ తెలియజేశారు. ఇక కరూర్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి జాతీయ ఉపశమనం నిధి (PMNRF) నుండి మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు, గాయపడిన వారికి ₹50,000 అందించనున్నారు.
ఇక తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ దుర్ఘటన తర్వాత వెంటనే కరూర్ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చూస్తే.. మృతుల కుటుంబాలకు ₹10 లక్షలు, గాయపడిన వారికి ₹1 లక్ష అందిస్తామని అన్నారు. ఏకసభ్య కమిషన్ (అరుణ జగదీశన్ నేతృత్వంలో) విచారణ ప్రారంభం కాగా, TVKకి చెందిన ముగ్గురు నేతలపై FIR నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ విషాద ఘటనపై తీవ్ర స్పందన వ్యక్తం చేసిన తమిళనాడు బీజేపీ నేతలు, ఈ ఘటనపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలంటూ డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఈ ఘటనపై ప్రజలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.