విదేశీ చిత్ర నిర్మాణాలపై వందశాతం సుంకం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వినోద రంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సమకాలీన భారతీయ సినిమాకు అమెరికా కీలకమైన ఆదాయ వనరుగా ఉంది. మొత్తం గ్రాస్ వసూళ్లలో అక్కడి నుంచి ముప్పైశాతం వరకు లభిస్తుండటంతో ట్రంప్ నిర్ణయంపై ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక హాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ట్రంప్ నిర్ణయంపై తీవ్రంగా స్పందిస్తున్నది. అయితే వందశాతం టారిఫ్ తాలూకు విధివిధానాలు ఖరారైన తర్వాతే ఈ సుంకాల పోటు ప్రభావం ఎంతవరకు ఉంటుందనే విషయంలో స్పష్టత వస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ట్రంప్ నిర్ణయం వెనక..
వందశాతం టారిఫ్ విధానంతో అమెరికా సినీ రంగానికి నూతన జవసత్వాలు సమకూర్చాలని, విదేశీ ప్రోత్సాహకాలకు ఆకర్షితులై అక్కడ నిర్మాణానికి మక్కువ చూపిస్తున్న టాప్ ప్రొడక్షన్ కంపెనీలను దారికి తెచ్చుకోవాలనే ఏకైక అజెండాతో ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని హాలీవుడ్ ఇన్సైడ్ టాక్. అమెరికాలో ఫిల్మ్ ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ. మానవ వనరుల కొరత కూడా ఉంది. ఈ కారణాలతో అగ్ర నిర్మాణ సంస్థలన్నీ కెనడా, బ్రిటన్, బల్గేరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో షూటింగ్స్‌కు ప్రాధాన్యతనిస్తున్నాయి. అక్కడి ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. అయితే విదేశాల్లో షూటింగ్స్ జరపడం వల్ల అమెరికాలో సినీ ఔత్సాహికులు, కార్మికులకు ఉపాధి తగ్గిపోతుందన్నది ట్రంప్ వాదన. బయటి దేశాలకు షూటింగ్స్ కోసం పన్నులు చెల్లిస్తూ అమెరికా నుంచి వసూళ్లు రాబట్టుకుంటున్నారని ఆయన ఆగ్రహంగా ఉన్నారు. అయితే వందశాతం టారిఫ్ అమలుకు కొన్ని సృజనాత్మకమైన అంశాలు కూడా ప్రతిబంధకంగా నిలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
సృజనాత్మకతపై గొడ్డలి పెట్టు
సినీరంగంపై ఏమాత్రం అవగాహన లేని దేశాధ్యక్షుడు తీసుకున్న ఓ వినాశకరమైన నిర్ణయమని మెజారిటీ హాలీవుడ్ నిపుణులు ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మిషన్ ఇంపాజిబుల్’ వంటి ప్రఖ్యాత ఫ్రాంఛైజీలు సృజనాత్మక కారణాల వల్ల ప్రపంచంలోని వివిధ దేశాల్లో షూటింగ్స్ జరుపుతారు. పాత్రల నేపథ్యం, కథ డిమాండ్ మేరకు అలా చేయాల్సిందే. టామ్ క్రూజ్ పారిస్ ఈఫిల్ టవర్ నేపథ్యంలో పర్ఫార్మ్ చేసే స్టంట్‌ని అక్కడ షూట్ చేస్తేనే సహజంగా ఉంటుంది. దానికోసం లాస్ఏంజిల్స్లో ఈఫిల్ టవర్ సెట్ వేస్తే అది పిచ్చితనంగా అనిపిస్తుంది. ట్రంప్ నిర్ణయం ఆర్థికపరమైన లావాదేవీల కంటే సినీ నిర్మాణంలో క్రియేటివ్ అంశాలపై మరింత ప్రభావాన్ని చూపిస్తుంది’ అని హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ లాయర్ అభిప్రాయపడ్డారు. అసలు ఈ సుంకాల విధింపు ఆలోచనే అంతా అయోమయంగా ఉందని హాలీవుడ్లో విమర్శలొస్తున్నాయి. ‘అమెరికాకు చెందిన ప్రొడక్షన్ హౌస్‌లు నిర్మిస్తున్న చిత్రాలకే ఈ సుంకాలు వర్తిస్తాయా? లేక విదేశీ నిర్మాతలు రూపొందిస్తున్న హాలీవుడ్ సినిమాలకు కూడానా? ఈ టారిఫ్ ఫిల్మ్ రెవెన్యూల వరకే పరిమితమా? లేక ప్రొడక్షన్ కాస్ట్ మీద కూడా వర్తిస్తుందా? అని ఓ హాలీవుడ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రశ్నించారు.
ఇప్పుడే నిర్ణయానికి రాలేం..
‘ట్రంప్ వందశాతం టారిఫ్ నిర్ణయం గురించి ఇప్పుడు ఏం చెప్పలేం. విధివిధానాలు ఖరారై చట్టంగా మారినప్పుడే దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు అమెరికాలో సినిమా కలెక్షన్స్‌పై 8శాతం ట్యాక్స్ చెల్లిస్తున్నాం. వందశాతం ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తే డిస్ట్రిబ్యూటర్స్‌కు మిగిలేది ఏమీ ఉండదు. అక్కడ ఒక్కో టికెట్‌కు సినిమా స్థాయిని బట్టి 10 – 15 డాలర్ల మధ్య ధర ఉంటుంది. ఒకవేళ వందశాతం టారిఫ్ విధిస్తే టిక్కెట్ రేట్లను రెండింతలు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే అమెరికాలో ఎవరూ థియేటర్ల వైపు వెళ్లరు. ఒకవేళ ట్రంప్ నిర్ణయం చట్టంగా మారితే అమెరికాలో తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది’- వెంకట్ (రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్)
‘ఓవర్సీస్ తెలుగు సినిమా లాభాల్లో 80 శాతం అమెరికా నుంచే వస్తాయి. హాలీవుడ్ బడా ప్రొడక్షన్స్ హౌస్‌లను కంట్రోల్ చేసే ఉద్దేశ్యంతోనే ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనిపిస్తున్నది. ఇది అమలైతే ఇక అమెరికాలో తెలుగు సినిమా ప్రదర్శన గురించి మర్చిపోవాల్సిందే. యూఎస్‌లో టారిఫ్ పెంచారని తెలుగు నిర్మాతలు.. అమెరికా డిస్ట్రిబ్యూటర్స్‌కు తక్కువ రేటుకు థియేట్రికల్ హక్కులను ఇవ్వలేరు కదా? మేము కూడా ఇక్కడ టికెట్ రేట్ డబుల్ చేసి అమ్మలేం? ఇలా ఏ విధంగా చూసినా ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థకు నష్టాన్ని కలిగిస్తుంది. అయితే ఈ విషయంపై ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటు చర్య అవుతుంది. వందశాతం టారిఫ్ చట్టంగా మారి విధివిధానాలు ప్రకటించిన తర్వాత పూర్తి వివరాలతో మాట్లాడగలం’-తేజ బోయపాటి (సరిగమ డిస్ట్రిబ్యూషన్)
తుది నిర్ణయం తీసుకోలేదు
విదేశాల్లో నిర్మాణం జరుపుకునే సినిమాలపై వందశాతం టారిఫ్ ప్రకటన వెలువడిన తర్వాత వరల్డ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో దీనిపై వైట్‌హౌస్ వర్గాలు తాజా ప్రకటన విడుదల చేశాయి. ‘విదేశాల్లో నిర్మాణం జరుపుకునే చిత్రాల టారిఫ్ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అధ్యక్షుడి సూచనలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కసరత్తులు చేస్తున్నది. ప్రపంచ సినిమాలో హాలీవుడ్‌ను గొప్పగా నిలపాలన్నదే ట్రంప్ ఆశయం. ఆ దిశగానే మేము కార్యచరణ మొదలుపెట్టబోతున్నాం’ అంటూ వైట్‌హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.