టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ నుంచి ఇప్పటివరకూ పాన్ఇండియా సినిమా రాలేదు. తొలి ప్రయత్నంగా కుమారస్వామి జీవితంలోని కొన్ని ఘట్టాలను తీసుకొని బన్నీతో భారీ పౌరాణిక చిత్రం పాన్ఇండియా స్థాయిలో తీయాలనుకున్నారాయన. కానీ.. అట్లీ సినిమాకు ముందుగా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. దాంతో ఈ స్క్రిప్ట్ తీసుకెళ్లి ఎన్టీఆర్ ముందుంచారు త్రివిక్రమ్. ఇప్పటివరకూ టాలీవుడ్లో కుమారస్వామి జీవితం ఆధారంగా సినిమా రాలేదు. పైగా కుమారస్వామి చరిత్రలో త్రివిక్రమ్ తీసుకున్న అంశం చాలా గొప్పది. అందుకే ఈ సినిమా చేసేందుకు తారక్ పచ్చజెండా ఊపేశారు. ఎన్టీఆర్ నటించిన ‘వార్2’ వచ్చే నెల 14న విడుదల కానుంది. ప్రస్తుతం ఆయన ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ పౌరాణిక చిత్రం షూటింగ్లోకి ఎంట్రీ ఇస్తారు తారక్.
ఈ లోపు కుమారస్వామి చరిత్రపై అవగాహన పెంచుకునే పనిలో ఉన్నారు ఎన్టీఆర్. రీసెంట్గా ఎయిర్పోర్ట్లో ఆయన ‘మురుగన్’ అనే పుస్తకంతో కనిపించిన విషయం తెలిసిందే. కార్తికేయ పురాణానికి సంబంధించిన పుస్తకమది. ఆ పుస్తకంలోనే త్రివిక్రమ్ ఎంచుకున్న కథ కూడా ఉన్నదని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం తారకాసురుడు అనే బ్రహ్మరాక్షసుడ్ని కుమారస్వామి అంతమొందించే చరిత్రే ఈ సినిమా కథ అని తెలుస్తున్నది. తారకాసుర సంహారం అయ్యాకే కుమారస్వామిని దేవతల సైన్యాధిపతిని చేస్తాడు శివుడు. అదే కథతో త్వరలో త్రివిక్రమ్, తారక్ రానున్నట్టు సమాచారం. ఇది పూర్తి పౌరాణిక చిత్రమని ఇదివరకే చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మీడియాకు తెలియజేశారు. ఈ సినిమాకు చెందిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.