Trisha | ఓ కథానాయిక ఇరవైఏండ్లకుపైగా స్టార్‌డమ్‌ను కాపాడుకోవడం నేటి తరంలో అంత సులభం కాదు. కానీ త్రిష ఆ ఘనతను సాధించింది. తన సమకాలీన నాయికలు చాలా మంది సినిమాలకు గుడ్‌బై చెప్పి వైవాహిక జీవితంలో స్థిరపడగా, త్రిష మాత్రం ఇప్పటికీ తిరుగులేని ఇమేజ్‌తో కెరీర్లో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఐదు భారీ చిత్రాల్లో నటిస్తుందంటే ఆమె క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలావుండగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమిళనాడు సీఎం కావాలన్నది తన బలమైన కోరికని త్రిష చెప్పింది.
ప్రజాసేవతో పాటు సామాజిక మార్పులు రాజకీయాల వల్లే సాధ్యమని అభిప్రాయపడింది. ఆమె వ్యాఖ్యలు తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ మాటల వెనక మతలబు ఏంటోనని చర్చ నడుస్తున్నది. త్రిష వంటి సూపర్స్టార్డమ్ ఉన్న కథానాయిక రాజకీయ కోణంలో చేసిన వ్యాఖ్యలను అంత ఈజీగా కొట్టి పారేయలేమని విశ్లేషకులు భావిస్తున్నారు.
తమిళనాట రాజకీయాలు, సినిమాలకు విడదీయరాని సంబంధం ఉన్న విషయం తెలిసిందే. అగ్ర హీరో దళపతి విజయ్ సైతం సినిమాల నుంచి తప్పుకొని సొంత పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో త్రిష వ్యాఖ్యలు తమిళనాట ప్రాధాన్యత సంతరించుకున్నాయి.