Tripti Dimri | ‘యానిమల్’ చిత్రంతో ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది కథానాయిక త్రిప్తి డిమ్రి. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకి వెళితే..ఇటీవల జైపూర్‌లో మహిళా పారిశ్రామిక వేత్తలు ఓ సదస్సును నిర్వహించారు. దీనికి పలువురు బాలీవుడ్ స్టార్స్‌ను కూడా ఆహ్వానించారు. వారిలో త్రిప్తి డిమ్రి కూడా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నిర్వాహకులు ఆమెకు ఐదు లక్షల రూపాయలను అందించారని తెలిసింది. అయితే తన తాజా చిత్రం ‘విక్కీ విద్య కా వోవాలా వీడియో’ ప్రమోషన్లో బిజీగా ఉండటం వల్ల త్రిప్తి డిమ్రి మహిళా పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరుకాలేక పోయింది.
దీంతో నిర్వాహకులు ఆమె వ్యహహార శైలిని తప్పుబడుతూ, ఈవెంట్లో ఏర్పాటు చేసిన ఆమె పోస్టర్లను ధ్వంసం చేశారు. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంపై త్రిప్తి డిమ్రి వ్యక్తిగత టీమ్ స్పష్టత నిచ్చింది. జైపూర్ ఈవెంట్లో పాల్గొనడానికి త్రిప్తి డబ్బులు తీసుకుందనే వార్తలు పూర్తి అవాస్తవమని, సినిమా ప్రమోషన్లో బిజీగా ఉండటం వల్లే అక్కడకు వెళ్లలేకపోయిందని వివరణ ఇచ్చారు. ‘వృత్తిపరంగా త్రిప్తి చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ప్రైవేట్ ఈవెంట్స్‌కు కూడా ఆమె డబ్బులు తీసుకోదు. దయచేసి ఈ పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టండి’ అని ఆమె టీమ్ స్పష్టం చేసింది.