భారతీయ సంగీత ప్రపంచ సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి 108వ జయంతి సందర్భంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఆమెకు విభిన్నంగా నివాళులర్పించింది. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గెటప్ ధరించి, ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో ఆమె పోస్ట్ చేయడంతో అవి ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో విద్యాబాలన్ అచ్చుగుద్దినట్టు ఎం.ఎస్.సుబ్బులక్ష్మిలా కనిపిస్తుండటం విశేషం.
ఈ విధంగా ఆ లెజెండరీ సింగర్‌పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నది విద్యాబాలన్. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి అంటే తనకెంతో ఇష్టమని, ఆ దిగ్గజ గాయని పాత్రలో నటించాలనేది తన జీవిత కాంక్ష అని ఈ సందర్భంగా విద్యాబాలన్ పేర్కొన్నారు. ఇంకా చెబుతూ ‘ఊహ తెలిసిన నాటి నుంచి పొద్దున్నే నిద్ర లేవగానే వేంకటేశ్వర సుప్రభాతం వినడం అలవాటు.
ఆ సుప్రభాతంలో వినిపించే గొంతు ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారిదే. ఆమె ఓ ఆధ్యాత్మిక శక్తి. ఈ రోజు ఆమె పుట్టినరోజు. అందుకే ఈ నివాళి.’ అన్నారు విద్యాబాలన్. ఇదిలావుంటే.. ఎం.ఎస్.సుబ్బులక్ష్మిలా ఉన్న విద్యాబాలన్ ఫొటోలు సోషల్ మీడియాలో వెలుగు చూడడంతో సుబ్బులక్ష్మి బయోపిక్ మరోసారి చర్చనీయాంశమైంది.
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్‌లో విద్యాబాలన్ నటిస్తున్నట్టు గతంలో ఓసారి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కీర్తి సురేశ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. మళ్లీ ఇప్పుడు విద్యాబాలన్ పేరు బలంగా వినిపిస్తుంది. అయితే.. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.