Gottimukkala Padma Rao | ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూశారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని తన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
గొట్టిముక్కల పద్మారావు 1954 నవంబర్ 8వ తేదీన జన్మించారు. చిన్నతనం నుంచి సినిమాలపై ఆసక్తితో ఆయన పద్మప్రియ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి పలు తెలుగు సినిమాలను నిర్మించారు. 1985లో సుమన్ హీరోగా ‘కంచు కవచం‘ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో పద్మారావు పోలీసు పాత్రలో కనిపించారు. 1986లో సీఎస్ రావు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ వేమన చరిత్ర‘ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఆ తర్వాత 1991లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా వంశీ దర్శకత్వంలో ‘ఏప్రిల్ 1న విడుదల‘ సినిమాను నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 1996లో రాజేంద్రప్రసాద్ హీరోగా ‘జోకర్‘ సినిమాను నిర్మించాడు. చివరగా 2006లో ‘నీ నవ్వే చాలు‘ సినిమాకు సమర్పకులుగా వ్యవహరించారు. పద్మారావుకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె సుజనారావు ‘గమనం‘ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం.
సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ పద్మారావు చురుకైన పాత్ర పోషించారు. యువకుడిగా ఉన్న సమయంలో 1970ల్లో తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. మలి దశ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 1996లో టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్లో చేరారు. 2014లో కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2018లో కాంగ్రెస్‌లో చేరారు.