స్టార్ హీరోల నుంచి ఏడాదికి ఒక్క సినిమా వస్తే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది 2022లో ఏకంగా టాలీవుడ్ (Tollywood) మెగా హీరోల (Mega Heroes) నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయి. అది కూడా ఒకరు ఇద్దరు కాదు ముగ్గురు హీరోలు మూడు సినిమాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అనుకోవడానికి ఈ ప్లాన్ అద్భుతంగా ఉంది. ఒకవేళ వర్కౌట్ ఐతే మాత్రం మెగా అభిమానులకు అంతకంటే కావాల్సింది మరొకటి లేదు. బాక్సాఫీస్ దగ్గర కూడా మెగా మోత మోగిపోవడం ఖాయం. 2022 త్రిబుల్ ధమాకా పవన్ కల్యాణ్ (Pawankalyan) తోనే మొదలు కాబోతుంది. సంక్రాంతికి ఈయన భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాతో రాబోతున్నాడు.
ఇది వచ్చిన మూడు నెలల తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు విడుదల కానుంది. సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో సీనియర్ నిర్మాత ఏ.ఎం రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. దీంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోయే సినిమా కూడా 2022 డిసెంబర్ లో విడుదల కానుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా వచ్చే ఏడాది మూడు సినిమాలు విడుదల చేయాలని పక్కా ప్రణాళికతో ఉన్నాడు.
కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా 2021లో విడుదల కావడం కష్టమే. ఈ సినిమాను 2022 ఫిబ్రవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో పాటే లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ 2022 మేలో విడుదల కానుందని తెలుస్తోంది. మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ భోళా శంకర్ కూడా 2022లోనే విడుదల కానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది దసరాకు విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. మరోవైపు బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే సినిమా 2023 సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఇక చివరగా రామ్ చరణ్ (Ramcharan) కూడా 2022లో మూడు సినిమాలు విడుదల చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న త్రిబుల్ ఆర్ 2022 ఉగాదికి విడుదల కానుంది. మరోవైపు తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తున్న ఆచార్య కూడా సమ్మర్ లోనే వస్తుంది. ఇక శంకర్ దర్శకత్వంలో రాబోయే సినిమా 2022 దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్స్ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. కానీ అనుకున్నట్లుగా వర్కౌట్ అవుతుందా..? లేదా..?అనేది చూడాలి.
ఇవికూడా చదవండి..
Lovestory| లవ్ స్టోరీ మేకర్స్ ను వెంటాడుతున్న స్పెల్లింగ్ మిస్టేక్..!
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర