Tharun Bhasckar | ఒకప్పుడు తెలంగాణ తాగునీటి సమస్యను, హైదరాబాద్లోని ట్రాఫిక్ సమస్యను ఎక్కువగా చూశానని, ఇప్పుడు ఈ రెండు సమస్యలూ పరిష్కారమయ్యాయని అంటున్నారు సినీ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్. ‘నమస్తే తెలంగాణ’తో ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు.
కొత్త రాష్ట్రంవచ్చాక సినిమాల విషయంలో ఏమైనా తేడా గమనించారా?
తెలంగాణ మాండలికానికి చెందిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయంటే అదంతా కొత్తరాష్ట్రం చలువే కదా. అందరు హీరోలూ తెలంగాణ నేటివిటీని ట్రై చేస్తున్నారంటే మనం గెలిచినట్టేగా.
ఈ పదేండ్లలో హైదరాబాద్లో మీరు చూసిన మార్పు ?
చాలా ఉన్నది. హైదరాబాద్ అభివృద్ధిని ప్రభుత్వం పరుగులు పెట్టించింది. కొన్నేండ్ల క్రితం వరకూ హైదరాబాద్ అంటే కొంత చిన్నచూపు ఉండేది. చెన్నై, బెంగళూరులకు ఇచ్చిన ప్రయారిటీ మనకుండేది కాదు. ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఇక్కడికొచ్చి జీవిస్తున్నారు. ఇది నిజంగా గర్వపడాల్సిన విషయం.
గతంలో హైదరాబాద్కు, ఇప్పటికీ తేడా ఎలా ఉంది ?
సదుపాయాలు చాలా పెరిగాయి. హైదరాబాద్ ఓ చిన్న దేశం లాంటిది. రోజుకు వేలాది మంది ఇక్కడకు బతకడానికి వస్తుంటారు. నిజానికి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండాలి. కానీ, ప్రభుత్వం కొత్తగా చాలా ఫ్లైఓవర్లు నిర్మించడంతో ట్రాఫిక్ సమస్య చాలావరకు తగ్గింది.
తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు గతంలో ఎలా ఉన్నాయి ? ఇప్పుడు ఎలా ఉన్నాయి ?
తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయి. ఒకప్పుడు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బోర్లు వేయడం పెద్ద ప్రహసనమే. వందల అడుగులు వేస్తే గానీ నీళ్లు పడేవి కావు. ఇప్పుడు తేలిగ్గా నీళ్లొస్తున్నాయని మా వరంగల్ మిత్రులు చెబుతున్నారు. ఆనందం అనిపించింది. రోడ్లు చాలా బాగున్నాయి. గ్రీనరీ కూడా అద్భుతంగా పెరిగింది. సీఎం కేసీఆర్, కేటీఆర్ హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ రోజు ఎటువైపు చూసినా తెలంగాణ పచ్చగా కనిపిస్తున్నది. పింక్ కలర్ తెలంగాణకు గ్రీన్ కలర్నిచ్చింది అని గట్టిగా చెప్పొచ్చు.