King Buddha | టాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత సత్యారెడ్డి హాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు, తమిళం, హిందీ చిత్ర పరిశ్రమల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ఓ భారీ బడ్జెట్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో తన మార్క్ చూపించనున్నారు. ఇందుకోసం ఆయన పాన్ వరల్డ్ సినిమాస్ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. ఈ చిత్రానికి ‘కింగ్ బుద్ధ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. దాదాపు పాతికేళ్ల క్రితం సర్దార్ చిన్నపరెడ్డి చిత్రంతో సినీ జీవితాన్ని ప్రారంభించిన సత్యారెడ్డి ఆ తర్వాత ప్రేమికుల రోజు, కుర్రకారు, రంగుల కళ, శంకర్ దాదా జిందాబాద్ వంటి 55కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి, నిర్మించి నటించారు. నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సినిమా రంగంలోనే కాకుండా, నిర్మాతల మండలిలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. 2016లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ ఛైర్మన్‌గా కూడా ఎన్నికయ్యారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సత్యారెడ్డి నిర్మించిన ఉక్కు సత్యాగ్రహం చిత్రం ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లోకి అనువాదమైంది. ఈ సినిమా నిర్మాణ సమయంలో హాలీవుడ్ నటులతో కలిసి పనిచేస్తున్నప్పుడు, తదుపరి ప్రాజెక్టును హాలీవుడ్ స్థాయిలో చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ఆ సమయంలోనే ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రేరణతో బౌద్ధమతంపై ఒక సినిమా చేయాలని అనుకున్నారట. కింగ్ బుద్ధ సినిమా షూటింగ్ లొకేషన్ల కోసం సత్యారెడ్డి ఇప్పటికే అమెరికా, చైనా, టిబెట్, నేపాల్, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా వంటి పలు దేశాలను సందర్శించారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని, త్వరలో అమెరికాలో ప్రముఖుల సమక్షంలో సినిమా పోస్టర్ లాంచ్ చేయడంతో పాటు ఇతర వివరాలు ప్రకటిస్తానని సత్యారెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.