ANR Lives On | తెలుగు సినీ పరిశ్రమకు వన్నె తెచ్చిన దివంగత నటుడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా.. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఏఎన్ఆర్ జయంతి సందర్భంగా నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ తనదైన శైలిలో నివాళులు అర్పించాడు. కోటేష్ ఒక డ్రాయింగ్ చార్ట్ పై నాగేశ్వరరావు చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఒక ప్రత్యేకత ఉంది: నాగేశ్వరరావు నటించిన సినిమాల పేర్లు, ఆయా సినిమాలలో ఆయన పోషించిన ముఖ్య పాత్రల పేర్లతోనే ఈ పోర్ట్రెయిట్‌ను రూపొందించారు. కోటేష్ చిత్రించిన ఈ కళాఖండం ఒక సాధారణ చిత్రం కాదు. దేవదాసు, ప్రేమాభిషేకం, మాయాబజార్, దసరా బుల్లోడు, ప్రేమనగర్ వంటి నాగేశ్వరరావు ఐకానిక్ చిత్రాల పేర్లను, అలాగే దేవదాసు, చక్రవర్తి, శ్రీనివాసరావు వంటి పాత్రల పేర్లను ఉపయోగించి ఏఎన్ఆర్ ముఖ కవళికలు, కళ్ళలో భావాలు, జుట్టు, దుస్తులు వంటి అన్ని వివరాలను ఎంతో నైపుణ్యంతో చిత్రీకరించారు. ఈ ప్రత్యేకమైన శైలి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
చింతలపల్లె కోటేష్ మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు ఒక ఆణిముత్యం. ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ ఒక జీవం ఉంది. అందుకే ఆయన నటించిన సినిమా పేర్లను, పాత్రల పేర్లను ఉపయోగించి ఆయన రూపానికి ఒక కొత్త కోణాన్ని ఇచ్చాను. ఇది ఆయనకు నా తరపున ఒక చిన్న నివాళి. ఈ పని చేయడానికి నాకు చాలా సమయం పట్టింది, కానీ ఫలితం చూసుకుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.