చమోలీ: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలకు కొండచరియలు(Uttarakhand Landslides) విరిగిపడ్డ విషయం తెలిసిందే. ఆ భారీ వరదల ధాటికి సమీప గ్రామాలు ధ్వంసం అయ్యాయి. కుంటారి లగాపాలి గ్రామంలో హృదయవిదారకర ఘటన చోటుచేసుకున్నది. శిథిలాల కింద తల్లి, ఆమె ఇద్దరు కవల పిల్లలను రెస్క్యూ దళాలు గుర్తించారు. 38 ఏళ్ల కాంతా దేవితో పాటు ఆమెకు చెందిన పదేళ్ల కవల పిల్లలు కూడా ప్రాణాలు విడిచారు. ఇద్దరు పిల్లలను చెరొకర్ని ఓ చేతిలో పట్టుకుని ఆ తల్లి తుది శ్వాస విడిచింది. చివరి నిమిషం వరకు తన పిల్లలను కాపాడుకునేందుకు ఆ తల్లి తీవ్రంగా ప్రయత్నించింది.
ఆ తల్లీ, పిల్లల శవాలను చూసిన స్థానికులు కన్నీరుమున్నీయ్యారు. ఇంటికి చెందిన భారీ గోడలు కూలడంతో.. ఆ తల్లీపిల్లలు మరణించారు. శుక్రవారం నాటికి అయిదుగురు మృతదేహాలను వెలికితీశారు. కాంతా దేవి భర్త కున్వర్ సింగ్ కొండచరిల్లో చిక్కుకున్నా.. అతను అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. 16 గంటల తర్వాత ఆ ఇంటిని ఎన్డీఆర్ఎఫ్ దళాలు అన్వేషించాయి. కాంతా దేవి భర్త ప్రాణాలతోనే ఉన్నా.. అతనికి ఇప్పుడు కుటుంబం, ఇళ్లు లేదు.