యజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి(54) కన్నుమూశారు. మంగళవారం రాత్రి గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. గోపీచంద్ కథానాయకుడిగా నటించిన ‘యజ్ఞం’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి.
అనంతరం బాలకృష్టతో ‘వీరభద్ర’ చిత్రాన్ని చేశారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కెరీర్‌కు కాస్త విరామిచ్చి నితిన్ ‘ఆటాడిస్తా’ చిత్రంతో మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఆ తర్వాత ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రాలను తెరకెక్కించారు. సాయిధరమ్‌తేజ్‌తో తీసిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా నంది పురస్కారం గెలుచుకున్నారు.
రాజ్‌తరుణ్‌తో గత ఏడాది తీసిన ‘తిరగబడరా సామి’ ఫ్లాప్ కావడంతో రవికుమార్ చౌదరి మానసికంగా ఒత్తిడికిలోనయ్యారని తెలిసింది. ఆయన హఠాన్మరణంతో తెలుగు చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. రవికుమార్ చౌదరి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులతో పాటు తెలుగు దర్శకుల సంఘం సంతాపం ప్రకటించింది.